హర్యానా బ్యాటర్ యశ్ వర్ధన్ దళాల్ తన అద్భుత ఇన్నింగ్స్‌తో ముంబై బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు. కర్నల్ సి.కె. నాయుడు ట్రోఫీ మ్యాచ్‌లో దళాల్ 426 పరుగులు చేయడంతో హర్యానా జట్టుకు భారీ ఆధిక్యం లభించింది. ఈ ఇన్నింగ్స్‌లో ఆయన 46 ఫోర్లు, 12 సిక్స్‌లు బాదారు. తొలి రోజు ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నా, దళాల్, ఆర్ష్ రంగా కలిసి భారీ పార్ట్‌నర్‌షిప్ ఏర్పాటు చేసి ముంబై ఆటగాళ్లను నిలువరించలేకపోయారు. ఈ జోడీ 410 పరుగుల పార్ట్‌నర్‌షిప్ ఏర్పాటు చేసింది. రంగా 151 పరుగులు చేసి అవుటయ్యారు.
రంగా ఔట్ అయ్యాక కూడా యశ్వర్ధన్ దళాల్ తన ఆటను ఆపలేదు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి హర్యానా 8 వికెట్ల నష్టానికి 732 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో భోసాలే మంచి ప్రదర్శన చేసి 58 ఓవర్లు బౌలింగ్ చేసి 129 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసినా, దళాల్‌ను అడ్డుకోలేకపోయాడు.
దళాల్ తన ఇన్నింగ్స్‌లో 250, 300, 350 పరుగుల మార్కులను సులభంగా దాటాడు. సాయంత్రం సెషన్‌లో 400 పరుగులను చేరుకున్నాడు. హర్యానా వికెట్లు పడడం కొనసాగుతున్నప్పటికీ, దళాల్ తన స్కోరును వేగంగా పెంచుకున్నాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి దళాల్ 463 బంతుల్ని ఎదుర్కొన్నాడు.
హర్యానా ఇంకా డిక్లేర్ చేయలేదు. రేపు మ్యాచ్ కొనసాగినప్పుడు దళాల్ తన రికార్డును మరింతగా పెంచుకునే అవకాశం ఉంది. దళాల్ ఇలాంటి భారీ స్కోర్లు చేయడం ఇదే మొదటిసారి కాదు. 2021, డిసెంబర్‌లో జరిగిన అండర్-16 లీగ్ మ్యాచ్‌లో 237 పరుగులు చేసి హర్యానా క్రికెట్ అకాడమీకి భారీ విజయాన్ని అందించాడు.