స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ తండ్రి విశ్వనాథ్ ఇటీవల కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్‌లుగా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ వీళ్ళందరూ కలిసి సంజు శాంసన్ కెరీర్‌ను దెబ్బతీశారని ఆయన ఆరోపించారు. వీళ్లు సంజు శాంసన్ కు ఇండియన్ క్రికెట్ టీమ్‌లో చాలా తక్కువ అవకాశాలు ఇచ్చారని, అందువల్ల ఆయన కెరీర్‌లో చాలా నష్టం జరిగిందని విశ్వనాథ్ అంటున్నారు. ఆయన మాటలు చాలామందికి షాక్ ఇచ్చాయి.

సంజు శాంసన్ ఇటీవల చరిత్ర సృష్టించారు. టీ20 క్రికెట్‌లో వరుసగా రెండు శతకాలు చేసిన మొదటి భారతీయ క్రికెటర్ అయ్యారు. కానీ ఆయన కెరీర్ ఇంత సులభంగా సాగలేదు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు టీ20 క్రికెట్‌కు రిటైర్ అయ్యే వరకు, సంజుకు అంతగా అవకాశాలు దక్కలేదు. ఈ ఏడాది జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టులో ఉన్నా, వార్మప్ మ్యాచ్‌లలో బాగా ఆడకపోవడంతో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం దక్కలేదు.

రాహుల్ ద్రవిడ్ స్థానంలో గౌతమ్ గంభీర్ కొత్త కోచ్‌గా వచ్చిన తర్వాత, శ్రీలంకతో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లకు సంజు శాంసన్‌ను తీసుకోలేదు. కానీ అప్పటి నుంచి పరిస్థితులు మారిపోయాయి. భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గంభీర్ సంజుపై చాలా నమ్మకం ఉంచారు. ఈ నమ్మకాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటూ సంజు బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికాపై వరుసగా రెండు శతకాలు చేశాడు.

సూర్యకుమార్ తనకు ఎంతో మద్దతు ఇచ్చాడని సంజు చెప్పాడు. "డులీప్ ట్రోఫీ ఆడుతున్నప్పుడు సూర్య నాతో, 'కచ్చితంగా నువ్వు తర్వాతి ఏడు మ్యాచ్‌లలో ఓపెనర్‌గా ఆడతావు. ఏం జరిగినా నేను నీకు మద్దతుగా ఉంటాను' అని చెప్పాడు. నా కెరీర్‌లో మొదటిసారి జట్టు మేనేజ్‌మెంట్ నుంచి ఇలాంటి నమ్మకం లభించింది" అని సంజు అన్నాడు. ధోనీ, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలపై సంజు తండ్రి చేసిన వ్యాఖ్యలను చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకరి కెరీర్ నాశనం కావడానికి వారు తప్పితే మిగతావారు కారణం కాదని టాలెంట్ ఉంటే ఎవరైనా సరే వారిని తీసుకుంటారని, అదృష్టం కూడా ఒకరి కెరీర్ ను శాసిస్తుందని అంటున్నారు.


 


మరింత సమాచారం తెలుసుకోండి: