టీమిండియా వికెట్‌కీపర్, బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ 2022 డిసెంబర్ 30న జరిగిన ప్రాణాంతకమైన కారు ప్రమాదం నుంచి అద్భుతంగా కోలుకున్నారు. తన స్వగ్రామం రూర్కీకి వెళ్తుండగా రిషభ్ పంత్ ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొని మంటలు అంటుకున్నాయి. అయితే, రజత్, నిషు అనే ఇద్దరు స్థానికులు వెంటనే స్పందించి మంటల్లో చిక్కుకున్న రిషభ్‌ను రక్షించి, అంబులెన్స్‌కు ఫోన్ చేయడంతో ఆయన ప్రాణాలు నిలిచాయి. ఈ ప్రమాదంలో రిషభ్‌కు కుడి మోకాలి లిగమెంట్ చిట్లిపోవడం, నుదుటిపై గాయాలు అయ్యాయి. దీంతో 26 ఏళ్ల ఈ క్రికెట్ ఆటగాడు ఏడాది పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నారు.
కారు ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత రిషభ్ పంత్ తన ప్రాణాలను కాపాడిన రజత్, నిషులకు ఎంతో కృతజ్ఞతలు తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టి వారికి ధన్యవాదాలు తెలిపారు. తన ప్రాణాలను కాపాడినందుకు కృతజ్ఞతగా వారిద్దరికీ స్కూటర్లు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఆ స్కూటర్లపై రిషభ్ పంత్ పేరును చెక్కించారని రజత్, నిషులు 7 క్రికెట్ ఇంటర్వ్యూలో తెలిపారు.
2024 ఐపీఎల్‌లో రిషభ్ పంత్ అద్భుతంగా రాణించారు. తన జట్టుకు అత్యధిక పరుగులు చేసి టీమిండియా టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు సంపాదించారు. టోర్నమెంట్‌లో ఆయన అద్భుత ప్రదర్శనతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
రిషభ్ పంత్ వన్డే, టెస్ట్ క్రికెట్‌లకు తిరిగి వచ్చిన తర్వాత అద్భుతంగా రాణిస్తున్నారు. టెస్ట్ క్రికెట్‌లో బంగ్లాదేశ్‌పై శతకం సాధించడంతో పాటు న్యూజీలాండ్‌తో జరిగిన సిరీస్‌లో కూడా అద్భుతంగా ఆడాడు.
ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మొదటి టెస్టు మ్యాచ్‌లో రిషభ్ పంత్ ఆడుతున్నాడు. పర్త్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌటయ్యింది. ఈ ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్ 37 పరుగులు చేసి భారత జట్టును నిలబెట్టాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా జట్టు కేవలం 104 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు ఆటలో కేఎల్ రాహుల్ (62), యశస్వి జైస్వాల్ (90) అద్భుతంగా ఆడుతూ భారత జట్టును 218 పరుగుల ఆధిక్యంలోకి చేర్చారు.