గుజరాత్ జట్టు బ్యాట్స్‌మెన్ ఉర్విల్ పటేల్ అనే ఆటగాడు కేవలం ఆరు రోజుల వ్యవధిలో రెండు టీ20 సెంచరీలు బాది సాధించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఇంతకు ముందు, అతను త్రిపుర జట్టుతో ఆడిన మ్యాచ్‌లో కేవలం 28 బంతుల్లోనే శతకం చేసి రికార్డు సృష్టించాడు. ఇప్పుడు ఉత్తరాఖండ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 36 బంతుల్లోనే రెండో సెంచరీ పూర్తి చేశాడు. ఇంత తక్కువ బంతుల్లో రెండు శతకాలు చేసిన తొలి ఆటగాడుగా ఉర్విల్ పటేల్ చరిత్రలో నిలిచిపోయాడు.

గుజరాత్ జట్టు 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉర్విల్ పటేల్ అద్భుతంగా ఆడాడు. కేవలం 41 బంతుల్లోనే 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 11 సిక్సర్లు బాదాడు. ఈ యంగ్ ప్లేయర్ వీర బాదుడు కారణంగా గుజరాత్ జట్టు 13.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుని 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఇంతకు ముందు మ్యాచ్‌లో కూడా ఉర్విల్ పటేల్ అద్భుతంగా ఆడాడు. 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేవలం 35 బంతుల్లోనే 113 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో 12 సిక్సర్లు, 7 ఫోర్లు బాదాడు. కేవలం 28 బంతుల్లోనే సెంచరీ చేసిన తొలి భారతీయ ఆటగాడుగా నిలిచాడు. ఆ మ్యాచ్‌లో అతని స్ట్రైక్ రేటు 322.86గా ఉంది. ఇది చాలా అద్భుతమైన రికార్డు.

ఉర్విల్ పటేల్ చాలా త్వరగా పరుగులు చేయడానికి ప్రసిద్ధి. గత సంవత్సరం, అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 41 బంతుల్లోనే సెంచరీ చేసి భారతీయ లిస్ట్-ఏ క్రికెట్‌లో రెండవ అతివేగవంతమైన సెంచరీ సాధించాడు. 26 ఏళ్ల ఉర్విల్ పటేల్‌ను 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆక్షన్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు 20 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. అయితే, 2024 ఐపీఎల్ ఆక్షన్‌కు ముందు అతన్ని విడుదల చేశారు. 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్‌లో అతని బేస్ ప్రైస్ 30 లక్షల రూపాయలుగా ఉంది కానీ ఎవరూ అతన్ని కొనుగోలు చేయలేదు. ఇప్పుడు వారందరూ బాధపడుతున్నారని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: