అవును, మీరు విన్నది నిజమే. ఆ టీమ్ ఇండియా క్రికెటర్ ఇంకా చదువుకుంటున్నాడు. చదువుకి వయస్సు, ఆటలు అడ్డంకి కావు అని నిరూపిస్తున్నాడు. అతను మరెవరో కాదు... ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో రూ.23.75 కోట్లకు అమ్ముడుపోయిన యువ క్రికెటర్ వెంటకేశ్ అయ్యర్. అవును, ఈ ఆల్‌రౌండర్ కోసం ఆర్సీబీతో తీవ్రంగా పోటీపడి మరీ డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ రూ.కోట్లు కుమ్మరించి మరీ తన ఫ్రాంచైజీలోనే కొనసాగేలా చూసుకుంది. ఈ క్రమంలో ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన ఆల్‌రౌండర్‌గా వెంకటేశ్ రికార్డుల్లోకి ఎక్కిన సంగతి విదితమే. అయితే క్రికెట్ కంటే కూడా చదువు ఎంతో ముఖ్యమని వెంకటేశ్ ఓ ప్రముఖ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేయడం ఇపుడు ప్రత్యేకతని సంతరించుకుంది.

ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... మనిషి మరణించేదాకా కూడా చదువు తోడు ఉంటుందని, కానీ 60 ఏళ్ల వయస్సులో ఆటను కొనసాగించలేమని వెంకటేశ్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. బాగా చదువుకొనే వారికి అది ఆటలో కూడా ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డాడు. ఈ క్రమంలోనే అతన్ని అతి త్వరలో డాక్టర్ వెంకటేశ్ అయ్యర్ అని పిలుస్తారని కూడా చెప్పాడు. ఇకపోతే 29 ఏళ్ల వెంకటేశ్ ఐపీఎల్‌లో 50 మ్యాచ్‌లు ఆడి, 137 స్ట్రైక్‌రేటుతో 1326 పరుగులు చేయగా 3 వికెట్లు పడగొట్టాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఐపీఎల్ ఫైనల్‌లో కేకేఆర్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసినదే. అపుడు కేవలం 26 బంతుల్లోనే అజేయంగా 52 పరుగులు సాధించి టైటిల్ ని సాధించాడు.

కాగా బాగా చదువుకున్న వ్యక్తి మైదానంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలడు అని ఈ సందర్భంగా ఆయన అన్న మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయ్యర్ ప్రస్తుతం ఫైనాన్స్‌లో పీహెచ్‌డీ చేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. నెక్స్ట్ టైమ్ తనని ఇంటర్వ్యూ చేసే సమయానికి డాక్టర్. వెంటకేశ్ అయ్యర్ అని పిలవాల్సి వస్తుందని సరదాగా చెప్పుకొచ్చాడు. ఐపీఎల్‌లో 2021 సీజన్‌లో అరంగేట్రం చేసిన వెంకటేశ్ కేకేఆర్ తరఫునే కొనసాగుతున్నాడు. తొలుత వెంకటేశ్‌ను కోల్‌కతా రిటైన్ చేసుకోలేదు. కానీ వేలంలో భారీ మొత్తం వెచ్చించి మరీ సొంతం చేసుకోవడం గమనార్హం!

మరింత సమాచారం తెలుసుకోండి: