
అవును, వన్డేల్లో డబుల్ సెంచరీ నమోదు చేసిన 4వ భారత క్రికెటర్‌గా ఇషాన్ కిషన్ నిలిచాడు. అంతకు మునుపు ఈ రికార్డ్ సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ పేరిట ఉంది. రోహిత్ అయితే అత్యధికంగా 3 సార్లు డబుల్ సెంచరీ బాదడం విశేషం. శిఖర్ ధావన్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఇషాన్.. ఆరంభంలో ఆచితూచి ఆడాడు. ఈ క్రమంలో 50 బంతుల్లో అర్ధ సెంచరీ చేసి, ఆ తర్వాత చెలరేగి ఆడాడు. ఈ క్రమంలో 85 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కొడితే సిక్స్ లేదంటే ఫోర్ అన్నట్టుగా రెచ్చిపోయి మరీ ఆడాడు. అలా మొత్తానికి 126 బంతుల్లో ఇషాన్ డబుల్ సెంచరీ నమోదు చేయడంతో తన పేరుని చరిత్ర పుటల్లో లిఖించుకున్నాడు.
ఈ నేపథ్యంలో ఆఖరికి 131 బంతుల్లో 210 పరుగులు చేసిన ఇషాన్.. తరువాత ఓ భారీ షాట్‌కు ప్రయత్నించి టస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో లిట్టన్ దాస్‌కు క్యాచ్ ఇచ్చి, వెనుదిరిగాడు. అంతేకాకుండా బంగ్లాదేశ్‌లో.. బంగ్లాదేశ్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన క్రికెటర్‌గా కూడా ఇషాన్ రికార్డ్ క్రియేట్ చేయడం చాలా అరుదైన విషయంగానే పరిగణించాలి. జట్టు స్కోరు 15 పరుగుల వద్ద మొదట శిఖర్ ధావన్ (3) ఔట్ కాగా.. విరాట్ కోహ్లితో కలిసి స్కోర్ బోర్డును పరుగులుపెట్టించిన ఇషాన్.. రెండో వికెట్‌కు ఏకంగా 290 పరుగులు జోడించి క్రికెట్ క్రీడాభిమానులను ఉత్సాహాన్నిచ్చాడు. అందులో దాదాపు 200 పరుగులు ఇషాన్ చేసినవే కావడం కొసమెరుపు.