దాదాపు 14 ఏళ్ల ఆయన క్రికెట్ ప్రయాణంలో ఎన్నో మైలు రాళ్లు ఉన్నాయి. 1986 సెప్టెంబర్ 17న తమిళనాడులో పుట్టిన రవిచంద్రన్ అశ్విన్ చిన్నప్పటినుండీ క్రికెట్ ఆట పట్ల ఆసక్తి కనబరిచాడు. మొదట అశ్విన్ తమిళనాడు, సౌత్ జోన్స్ నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్లో "చెన్నై సూపర్ కింగ్స్" తరుపున తన పయనం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో అశ్విన్ టెస్టుల్లో 500కి పైగా వికెట్లు పడగొట్టి రికార్డ్ నెలకొల్పాడు. ఇక సంఖ్యా పరంగా చూసుకుంటే, అత్యంత వేగంగా 300 టెస్ట్ వికెట్లు సాధించిన బౌలర్‌గా అశ్విన్ పేరిట రికార్డ్ ఉంది. అంతేకాకుండా టెస్టుల్లో పదకొండు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను గెలుచుకుంది కూడా ఇతనే. టెస్ట్ క్రికెట్‌లో ఆల్ రౌండర్‌గా, డౌన్ ఆర్డర్ బ్యాటింగ్ చేసి ఆరు టెస్ట్ సెంచరీలు మరియు టెస్టుల్లో 3000 పరుగులు కూడా సాధించాడు.
ఇక సెప్టెంబర్ 2024 నాటికి, అశ్విన్ ICC పురుషుల ప్లేయర్ ర్యాంకింగ్స్‌లో అత్యధిక ర్యాంక్ పొందిన బౌలర్ గా పేరు గడించాడు. మొదట్లో అశ్విన్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా స్టార్ట్ అయినప్పటికీ, పరిమిత విజయాల కారణంగా ఆర్డర్‌ను వదులుకొని, ఆఫ్-బ్రేక్ బౌలర్‌గా మారాడు. అశ్విన్ 2010 ఇండియన్ ప్రీమియర్ లీగ్లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరపున ఆడి, మెరుగైన ఆటతీరుని కనబరిచాడు. అక్కడ అతని బౌలింగ్ చూసి 2010లో పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లలో అతని తొలి అంతర్జాతీయ కాల్-అప్‌కు కాల్ వచ్చింది. 2014 ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ20 మరియు రెండు IPL టైటిళ్లను ( 2010 , 2011 ) CSKతో కలిసి సాధించాడు అశ్విన్.
2011లో, వెస్టిండీస్‌పై అశ్విన్ తన మొదటి టెస్టు అరంగేట్రం చేశాడు. ఇక ఆ అరంగేట్రంలోనే 5 వికెట్లు తీసి ఏడవ భారత బౌలర్‌గా రికార్డులు నెలకొల్పాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఒక సిరీస్‌లో అయితే అశ్విన్ ఏకంగా 29 వికెట్లు పడగొట్టి కంగారులను భయపెట్టాడు. నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఏ భారతీయ బౌలర్ కూడా సాధించని ఘనతను అశ్విన్ సాధించి అత్యధిక వికెట్లు పడగొట్టాడు. 2015-16 సీజన్‌లో, అతను 19 T20Iలలో 27 వికెట్లతో పాటు 8 టెస్ట్ మ్యాచ్‌లలో 48 వికెట్లు మరియు 336 పరుగులు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే 2016 కొరకు ICC క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ మరియు ICC పురుషుల టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను కూడా గెలుచుకొని రికార్డుల్లోకి ఎక్కాడు. ఆయన చేసిన సేవలకు గాను, 2015లో భారత ప్రభుత్వం అతనికి "అర్జున అవార్డు"ను కూడా అందించింది. ఇక 18 డిసెంబర్ 2024న, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సమయంలోనే అశ్విన్ అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించి క్రీడాభిమానులు షాక్ ఇచ్చాడు.