భారత దేశవాళీ క్రికెట్‌లో ఓ యువ బ్యాట్స్‌మెన్ సంచలనం సృష్టించాడు. దాంతో ఇది చాలా అరుదైన రికార్డ్ అని క్రీడా పండితులు అతనిని ఆకాశానికెత్తేస్తున్నారు. అవును, ఈ క్రీడాకారుడు కేవలం 4 రోజుల్లోనే రెండోసారి డబుల్ సెంచరీ సాధించి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు మరి! ఈ ఆటగాడు మరెవరో కాదు సమీర్ రిజ్వీ.. సమీర్ రిజ్వీ ప్రస్తుతం అండర్-23 స్టేట్ ఎ ట్రోఫీలో ఆడుతున్న సంగతి మీకు తెలిసే ఉంటుంది. ఈ టోర్నీలో అతడు అద్భుతంగా రాణిస్తున్నాడని సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఈసారి విదర్భ జట్టుపై డబుల్ సెంచరీ సాధించాడు. గతంలో త్రిపురపై సమీర్ రిజ్వీ ఈ ఘనత సాధించడం విశేషం.
విషయం ఏమిటంటే? ఆ మ్యాచ్‌లో టోర్నీలో సమీర్ రిజ్వీ అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీని నమోదు చేయడం ఇపుడు సంచలనంగా మారింది. ఉత్తరప్రదేశ్, విదర్భ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో అత్యధిక స్కోర్లు నమోదు కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ జట్టు 406 పరుగులు చేయగా... సమీర్ రిజ్వీ బ్యాటింగ్ ముందు ఈ లక్ష్యం చిన్నదేనని ప్రూవ్ అయింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సమీర్ రిజ్వీ 105 బంతుల్లో 202 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 18 సిక్సర్లు బాదాడు. సమీర్ రిజ్వీ 192.38 స్ట్రైక్ రేట్‌తో ఈ పరుగులు చేశాడు. సమీర్ ఇన్నింగ్స్ కారణంగా తన జట్టు కేవలం 41.2 ఓవర్లలో 407 పరుగుల లక్ష్యాన్ని సాధించింది.
ఇకపోతే సమీర్ రిజ్వీ డిసెంబర్ 21న త్రిపురపై డబుల్ సెంచరీ సాధించిన సంగతి మీకు గుర్తుండే ఉంటుంది. 21 ఏళ్ల సమీర్ రిజ్వీ త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో 97 బంతుల్లో 201 పరుగులతో అజేయంగా నిలవడంతో సహ క్రీడాకారులు సంబరాలు చేసుకున్నారు. ఈ సమయంలో సమీర్ రిజ్వీ 13 ఫోర్లు, 20 సిక్సర్లు బాదడమే కాకుండా ఈ టోర్నీలో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ ఘనత కూడా సాధించాడు. సమీర్ రిజ్వీ ఒక మ్యాచ్‌లో 153 పరుగులు, మరో మ్యాచ్‌లో 137 నాటౌట్‌తో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన సంగతి విదితమే. ప్రస్తుతం అండర్-23 స్టేట్ ఎ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సమీర్ రిజ్వీ ముందున్నాడు. సమీర్ రిజ్వీ గత ఏడాది మాత్రమే IPLలో అరంగేట్రం చేసిన సంగతి అందరికీ తెలిసినదే.