క్రీడాకారుడు గౌతం గంభీర్ గురించి జనాలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గంభీర్ ఎన్నో అంచనాల నడుమ టీమిండియాలోకి ప్రవేశించాడు. ఈ నేపథ్యంలో టీమిండియాను మరో మెట్టుకు తీసుకెళ్తారని అంతా గంభీర్ పై ఆశలు పెట్టుకున్నారు. ఇక t20 వరల్డ్ కప్ - 2024 నెగ్గి ఊపు మీదున్న మెన్ ఇన్ బ్లూకు వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌ కప్‌తో పాటు చాంపియన్స్ ట్రోఫీని కూడా అందిస్తాడని అంతా నమ్మారు. కానీ అవన్నీ అడియాశలుగానే మిగిలిపోయాయి. గంభీర్ కోచింగ్‌లో లంక సిరీస్‌ నుంచి ఆసీస్ సిరీస్ వరకు వన్డేలు, టెస్టుల్లో భారత్ ఘోర పరాజయాలు చవి చూస్తూ వస్తోంది. రెడ్ బాల్ క్రికెట్‌లోనైతే టీమ్ పెర్ఫార్మెన్స్ రోజురోజుకీ దిగజారుతోంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు గంభీర్ పోస్టుకి గండం కలిగినట్టు గుసగుసలు వినబడుతున్నాయి. అవును... భారత్‌ వరుస పరాజయాలతో బీసీసీఐ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. కొందరు సీనియర్లతో హెడ్ కోచ్ గంభీర్‌కు గల గొడవలు కారణంగా బోర్డు ఈ విషయంలో సీరియస్‌గా ఉందని గుసగుసలు వినబడుతున్నాయి. గంబీర్ కోచ్‌గా వచ్చినప్పటి నుంచి సీనియర్‌ ఆటగాళ్లతో పడకపోవడం, విభేదాలు రోజురోజుకీ ముదరడంతో బోర్డు దృష్టికి వెళ్లినట్టు సమాచారం. దీంతో ఒకవేళ పరిస్థితి మెరుగవకపోతే గంభీర్‌ను తప్పించడానికి కూడా బీసీసీఐ వెనుకాడదని సమాచారం.

ఈ క్రమంలోనే బీసీసీఐ... ‘కోచ్ రోల్‌కు గంభీర్‌ మా మొదటి ప్రయారిటీ కానే కాదు. వీవీఎస్‌ లక్ష్మణ్‌ మా ఫస్ట్ చాయిస్. అయితే, అతడు కోచింగ్‌కు విముఖత చూపడంతో గంభీర్‌ను తీసుకున్నాం. లేదంటే ఇలాంటి పరిణామాలు వచ్చేవి కావు!’ అని బీసీసీఐ పెద్దలు అన్నట్లు నేషనల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. నిబంధనలను అతిక్రమిస్తున్నారని గంభీర్‌తో పాటు సపోర్టింగ్‌ స్టాఫ్‌ పైనా అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఒకవేళ ఈ పరిస్థితిలో గనుక మార్పు రాకపోతే గౌతమ్ పోస్టుకు ముప్పు తప్పదని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. అతడి స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్‌ను రీప్లేస్ చేయాలని బీసీసీఐ అనుకుంటున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపధ్యలోనే ఎలాగైనా వీవీఎస్ లక్ష్మణ్‌ను ఒప్పించి కోచింగ్ పగ్గాలు అప్పగించాలని భావిస్తోందట. కనీసం టెస్ట్ ఫార్మాట్‌కైనా వీవీఎస్‌ను కోచ్‌గా నియమించాలని చూస్తోందట మరి!

మరింత సమాచారం తెలుసుకోండి: