భారత్ - ఆస్ట్రేలియా మధ్య 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా 5వ మ్యాచ్ జరుగుతున్న విషయం అందరికీ తెలిసినదే. ఇక్కడ బాధాకరం ఏమిటంటే? ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ భాగస్వామ్యం కాకపోవడం. అవును, ఈ మ్యాచ్ రోహిత్ టెస్టు కెరీర్‌లో చివరి మ్యాచ్ అని గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చిన సంగతి అందరికీ తెలిసినదే. కాగా అతనికి ఇపుడు సిడ్నీ టెస్టు ఆడే అవకాశం కూడా రాకపోవడం కొసమెరుపు. ఇటువంటి పరిస్థితిలో, అతని టెస్ట్ కెరీర్ ముగిసిందని, ఏ క్షణంలోనైనా రిటైర్మెంట్ ప్రకటించవచ్చని క్రికెట్ పండితులు చెబుతున్నారు.

అవును, జస్ట్ 188 రోజుల్లో రోహిత్ శర్మ కథ పూర్తిగా మారిపోవడం మనం చూశాము. ఎందుకంటే? గతేడాది జూన్‌లో అతని కెప్టెన్సీలోనే టీమిండియా టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆనాడు రోహిత్ ఒక హీరోగా కనబడ్డాడు. ఐసీసీ టోర్నీలను గెలుచుకున్న భారత కెప్టెన్లు ఆనాడు కొందరే ఉన్నారు. వారిలో రోహిత్ శర్మ కూడా ఒకడిగా పేరుగాంచాడు. అతని కెప్టెన్సీలో భారత జట్టు టీ20 ప్రపంచకప్ గెలవడంతో దేశానికే హీరో అయ్యాడు. ప్రతిచోటా అతని గురించి మాట్లాడడం జరిగింది. దిగ్గజాలు అంతా అతనిని ఆకాశానికెత్తేశారు. అయితే టీ20 వరల్డ్‌కప్ తర్వాత అతడి అదృష్టం అదృశ్యం అయింది.

టీ20 ప్రపంచ కప్ నుంచి అతని బ్యాట్ నుంచి కనీస పరుగులు కూడా రాలేదు. పైపెచ్చు, అతని కెప్టెన్సీలో జట్టు ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోవడం కూడా పెద్ద మైనస్ గా మారింది. ఇప్పుడు అతగాడు కెప్టెన్‌గా ఉన్నప్పటికీ జట్టు నుంచి తప్పుకోవడానికి ఇదే కారణం అని తెలుస్తోంది. 2024 టీ20 ప్రపంచకప్ తర్వాత రోహిత్ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన సంగతి విదితమే. ఆ తర్వాత అతను క్రికెట్ నుంచి విరామం తీసుకున్నాడు. శ్రీలంక పర్యటన నుంచి తిరిగి రాగా... ఈ పర్యటనలో 3-మ్యాచ్‌ల ODI సిరీస్‌లో 52.33 సగటుతో 157 పరుగులు చేశాడు. ఇందులో 2 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఆ తర్వాత భారత జట్టు టెస్ట్ సీజన్ స్టార్ట్ కాగా... ప్రతి టెస్టు మ్యాచ్‌లోనూ రోహిత్ ఫ్లాప్‌ అయ్యాడు.

మరీ ముఖ్యంగా టీ20 ప్రపంచ కప్ తర్వాత, రోహిత్ బంగ్లాదేశ్‌తో 2 టెస్టులు, న్యూజిలాండ్‌తో 3 టెస్టులు, ఇప్పుడు ఆస్ట్రేలియాతో 3 టెస్టులు ఆడడం జరిగింది. ఈ వ్యవధిలో అతను ఒక్కసారి మాత్రమే 50 పరుగుల మార్కును టచ్ చేయగలిగాడు. బ్యాటింగ్‌లోనే కాకుండా కెప్టెన్సీలో కూడా ఫ్లాప్‌ కావడం అతనికి శాపంలాగా మారింది. బంగ్లాదేశ్‌తో జరిగిన 2 టెస్టులు మినహా టీ20 ప్రపంచకప్ తర్వాత ఒక్క టెస్టు మ్యాచ్ కూడా గెలవకపోవడం బాధాకరం. గత 6 టెస్టు మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేకపోయిన అతను కేవలం 1 మ్యాచ్‌ను మాత్రమే డ్రా చేసుకోగలిగాడు. న్యూజిలాండ్ జట్టు స్వదేశంలో టీమిండియాను 3-0తో ఓడించింది. ఇది అత్యంత అవమానకరమైన ఓటమిగా పరిణమించింది. అదే సమయంలో ఆస్ట్రేలియా సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో రోహిత్ గైర్హాజరీలో టీమిండియా విజయం సాధించింది. కానీ రోహిత్‌ వచ్చాక ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేకపోయింది. ఇన్ని ఘటనల తర్వాతే రోహిత్‌ను జట్టు నుంచి తప్పించాలని నిర్ణయించినట్టు చాలా స్పష్టంగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: