సిడ్నీ వేదికగా జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో భారత స్టార్‌ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా రికార్డులు నమోదు చేస్తున్నాడు. అవును, బుమ్రా తాజాగా 46 ఏళ్ల రికార్డును బద్ధలు కొట్టి అరుదైన ఘనత సాధించడంతో టీమిండియా అభిమానులు ఖుషీ అవుతున్నారు. 5 టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా గడ్డ మీద అత్యధిక వికెట్లు (32*) తీసిన భారత బౌలర్‌గా బుమ్రా నిలవడం విశేషం. 5 టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టుకు సారథ్యం వహించిన జస్ప్రిగ్ బుమ్రా ఐదో టెస్టుకు సైతం భారత కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలో భారత పేసర్ బుమ్రా అరుదైన ఘనత సాధించినట్టు తెలుస్తోంది.

భారత స్పిన్‌ దిగ్గజం బిషన్‌ సింగ్‌ బేడీ పేరిట ఉన్న రికార్డును బుమ్రా బద్దలు కొట్టాడు. కాస్త వెనక్కి వెళితే... 1977/ 78 సీజన్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన 5 టెస్టుల సిరీస్‌‌లో స్పిన్నర్ బిషన్ సింగ్ బేడీ 31 వికెట్లు తీయడం గమనార్హం. అంటే దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా ఈ రికార్డు అలాగే పదిలంగా ఉండడం గర్వకారణం. అయితే అదే రికార్డుని మరో భారతీయుడు బద్దలు కొట్టడంతో సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. హర్బజన్, అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్, జహీర్ ఖాన్ లాంటి దిగ్గజ బౌలర్లు వచ్చినా ఈ రికార్డును అధిగమించలేకపోవడం కొసమెరుపు. బోర్డర్ - గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో 5వ టెస్ట్ ప్రారంభానికి ముందు బుమ్రా ఈ సిరీస్ లో 30 వికెట్లు పడగొట్టాడు. సిడ్నీ టెస్టులో తొలి రోజు ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను ఔట్ చేసిన బుమ్రా శనివారం 2వ రోజు ఆటలో మార్నస్ లబుషేన్ వికెట్ తీయడంతో బుమ్రా ఖాతాలో ఈ అరుదైన రికార్డ్ చేరింది.

ఇక ఈ టెస్ట్ తుది దశకు చేరేసరికి బుమ్రా మరికొన్ని వికెట్లు పడగొట్టి ఇంకెవ్వరికీ అందనంత ఎత్తులో నిలవనున్నాడు. ప్రస్తుతం బుమ్రా అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన భారత బౌలర్‌గా కొనసాగుతున్నాడు. 2024లో 13 టెస్టుల్లోనే 71 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా బుమ్రా నిలిచిన సంగతి విదితమే. బుమ్రా క్లిష్ట సమయంలో వికెట్లు తీస్తూ భారత్ విజయాలలో కీలక పాత్ర పోషిస్తున్నాడు అనడంతో అతిశయోక్తి లేదు. రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేని సమయంలో కూడా కెప్టెన్‌గా తన సేవలు అందిస్తున్నాడు. అనుభవం ఉన్న కెప్టెన్లలా బుమ్రా వ్యూహాలు రచిస్తూ, అటు బౌలింగ్ లోనూ జట్టును ముందుడి నడిపిస్తున్న తీరుని చూసి సీనియర్లు సైతం వారెవ్వా అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: