బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టీమిండియా ఎలా చేజార్చుకుందో ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ ఆటగాళ్లంతా ఈసారి పేలవ ప్రదర్శనతో అభిమానులకు అసంతృప్తిని కలిగించారు. వీరు గతంలో ఆడిన ఆటగాళ్లేనా అని అనుకునేలా టీమ్ ఇండియా ఆటగాళ్ల ప్రదర్శన సాగింది. ఇలాంటి సమయంలో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో చోటు చేసుకున్న ఓ ఘటన దీన్ని మరింత పరాకాష్టకు చేర్చడం కొసమెరుపు. విషయంలోకి వెళితే... భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్ లో హెడ్ కోచ్ గౌతం గంభీర్ ఆటగాళ్లను గట్టిగా మందలించాడని, ఇకపై తాను చెప్పినట్లే ఆడాలని, అలా ఆడకపోతే బావుండదని చెప్పాడని వార్తలు గుప్పుమన్నాయి.

ఈ క్రమంలోనే కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ ఆటతీరుపైన గంభీర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇదే విషయంలో ఇతర ప్లేయర్లతో మాట్లాడినప్పుడు వారిని రోహిత్ సరిగా నడిపించలేపోతున్నట్లు కూడా గుర్తించారనే ప్రచారం జరిగినట్టు తెలిసిందే. కట్ చేస్తే, రోహిత్ శర్మ సిడ్నీ టెస్టుకు పూర్తిగా దూరం జరిగాడు. దీంతో ఆ రోజు డ్రెస్సింగ్ రూమ్ లో ఏం జరిగిందనే చర్చ ఇపుడు సర్వత్రా నడుస్తోంది. అయితే టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో జరిగిన చర్చపై గౌతం గంభీర్ ఇప్పటికే వివరణ ఇచ్చే ప్రయత్నం చేసాడు. ఆటగాళ్లకు దిశానిర్దేశం మాత్రమే చేసినట్లు గంభీర్ చెప్పుకొచ్చినప్పటికీ అంతకు మించింది ఏదో జరిగిందన్న అనుమానం మాత్రం అభిమానుల్ని వీడలేదు.

అవును, తాజాగా అందుతున్న సమాచారం మేరకు భారత డ్రెస్సింగ్ రూమ్‌లో పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉన్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి. మరోవైపు కోహ్లీ ఫ్రెండ్, మాజీ సౌతాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఈ విషయంపై చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. నిప్పు లేనిదే పొగ రాదని.. భారత డ్రెస్సింగ్ రూములో ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేసాడు. విదేశాల్లో క్రీడాకారులు ఆడేటప్పుడు చాలా వత్తిడి ఉండడం సహజం అని, కుటుంబం నుండి వారాల తరబడి దూరంగా ఉండడం వలన ఒత్తిడికి లోనై కుంగిపోతారని చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలోనే వరుస ఓటములు టీమిండియా ఆటగాళ్లలో విభేదాలు కూడా సృష్టించి ఉండవచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేసాడు. దాంతో ఈ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: