కెరీర్ పరంగా బిజీగా ఉన్నప్పటికీ.. సానియా తన టెన్నిస్ అకాడమీల బాధ్యతలను కూడా చూసుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితమే తన కుమారుడు ఇజాన్‌తో కలిసి కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. "నాకు ఎప్పటికీ తోడుండేవాడు" అంటూ కొడుకుతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు సానియా. తన కుమారుడు ప్రస్తుతం ఆరేళ్ల వయస్సులో ఉన్నాడు.
అంతేకాదు ఒక ఇంటర్వ్యూలో సింగిల్ మదర్‌గా తన జీవితం గురించి సానియా కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. తన కెరీర్‌లో ఎన్ని విజయాలు సాధించినా.. తన కుమారుడు ఇజాన్ అన్నిటికంటే ముఖ్యం అని ఆమె స్పష్టం చేశారు. అందుకే ప్రొఫెషనల్ లైఫ్‌తో పాటు తల్లిగా తన బాధ్యతలకు సమ ప్రాధాన్యతనిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఆమె పనుల కోసం బయటకు వెళ్లడం లేదు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే ఒకటి లేదా రెండు రోజులకు మించి కుమారుడికి దూరంగా ఉండటానికి ఇష్టపడరు.
ప్రజా జీవితంలో ఉండటం వల్ల కొన్ని సవాళ్లు ఉంటాయని సానియా అన్నారు. తనకున్న ఫేమ్ తనపై ఒత్తిడి తీసుకురాకపోయినా.. బాధ్యత మాత్రం బాగా పెరిగిందని ఆమె తెలిపారు. ఎందుకంటే చాలామంది పిల్లలు తనను ఆదర్శంగా భావిస్తారని.. అందుకే తాను ఎలా ప్రవర్తిస్తున్నాననే దానిపై దృష్టి పెడతానని అన్నారు. ప్రజల దృష్టిలో ఉన్నప్పటికీ.. తన నిజాయితీని వీడకుండా మనసులోని మాటను మాట్లాడతానని చెప్పారు. ఇలాంటి గుర్తింపు రావడం ఎంతో గర్వంగా, గౌరవంగా భావిస్తున్నానని సానియా పేర్కొన్నారు.