బంగాళాదేశ్ సీనియర్ ఆటగాడు తమీమ్ ఇక్బాల్ గురించి క్రికెట్ ప్రేక్షకులకు బాగా తెలుసు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి తమీమ్ ఇక్బాల్ పునరాగమనం చేస్తాడని అంతా అనుకున్నారు. అయితే, ఈ వెటరన్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి రావడం లేదని ప్రకటించడం ద్వారా ఆ చర్చలకు ఎండ్ కార్డు పడినట్టు అయింది. విషయంలోకి వెళితే... తమీమ్ ఇక్బాల్ తను తన అంతర్జాతీయ కెరీర్‌కు అధికారికంగా వీడ్కోలు చెబుతున్నట్టు సోషల్ మీడియా పోస్ట్‌లో చాలా స్పష్టంగా పేర్కొన్నాడు.

అవును... తమీమ్ 35 ఏళ్ల వయస్సులో తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ను ముగిసిందని ఈ సందర్భంగా రాసుకొచ్చాడు. ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఈ పోస్టుని గమనిస్తే... "నేను చాలా కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాను. ఇక దీనికి ఎండ్ కార్డు పడే సమయం ఆసన్నమైంది. నేను చాలా కాలంగా నా పర్సనల్ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. ఈ రోజు నా అంతర్జాతీయ క్రికెట్ అధ్యాయం ముగిసింది! ఈ ప్రయాణంలో నాకు తోడున్నవారికి పేరుపేరునా ధన్యవాదాలు!" అని రాసుకొచ్చారు. తమీమ్ ఈ నిర్ణయం తీసుకోవడానికి తన సమయాన్ని వెచ్చించుకున్నానని, నా గురించిన చర్చతో జట్టు దృష్టి మరల్చకూడదని ఆయన వెల్లడించడం గమనార్హం.

అయితే తమీమ్ అంతర్జాతీయ క్రికెట్‌కు మరోసారి వీడ్కోలు పలకడం పట్ల కొందరు మిశ్రమంగా స్పందిస్తున్నారు. విషయం ఏమిటంటే... 2023, జులై 6న అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరవుతున్నట్లు అయన ప్రకటించగా... అప్పటి దేశ ప్రధాని హసీనా విజ్ఞప్తి మేరకు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. ఈసారి మాత్రం వెనక్కి తగ్గేది లేదని, అంతర్జాతీయ క్రికెట్‌ను పూర్తిగా వీడుతున్నట్లు స్పష్టం చేస్తూ ఓ పోస్ట్ చేసారు. దాంతో కొంతమంది ఎన్నిసార్లు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతావు? అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఇకపోతే, బంగ్లాదేశ్ తరఫున 243 వన్డే మ్యాచ్‌లు ఆడిన తమీమ్, 240 ఇన్నింగ్స్‌లలో మొత్తంగా 8357 పరుగులు సాధించడం గమనార్హం. ఇందులో 56 హాఫ్ సెంచరీలు, 14 సెంచరీలు ఉన్నాయి. అదే సమయంలో, అతను 70 టెస్ట్ మ్యాచ్‌లలో 134 ఇన్నింగ్స్‌లలో 5134 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలు ఉన్నాయి.అలాగే 78 టీ20ల్లో 1758 పరుగులు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: