2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఇండియా జట్టు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఈ జట్టు ఎంపికపై చాలా ఉత్కంఠ నెలకొన్నది  ఈ నేపథ్యంలోనే మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా, స్పిన్ బౌలింగ్ విభాగంలో చోటు కోసం జరుగుతున్న పోటీపై ఆయన చేసిన విశ్లేషణ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వరుణ్ చక్రవర్తి అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో అతడికి జట్టులో స్థానం దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయని చోప్రా అభిప్రాయపడ్డారు.

ఒకవేళ ఇది నిజమైతే, సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు చోటు దక్కకపోవచ్చని ఆయన జోస్యం చెప్పడం విశేషం. అయితే, మరో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు మాత్రం జట్టులో కచ్చితంగా చోటు ఉంటుందని చోప్రా స్పష్టం చేశారు.

వరుణ్ చక్రవర్తి గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన అతడు, ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలోనూ తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తమిళనాడు జట్టు టోర్నీ నుంచి వైదొలిగినా, చక్రవర్తి ఆడిన ఆరు మ్యాచ్‌లలో ఏకంగా 18 వికెట్లు పడగొట్టాడు. అతని బౌలింగ్ సగటు కేవలం 12.72గా ఉండటం అతడి ప్రదర్శనకు నిదర్శనం.

రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీయడం హైలైట్‌గా నిలిచింది. అంతేకాదు, టీ20 జట్టులోకి కం బ్యాక్ ఇచ్చిన టైమ్ నుంచి చక్రవర్తి నిలకడగా వికెట్లు సాధిస్తూ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ, "వరుణ్ చక్రవర్తి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు, నిలకడగా వికెట్లు తీస్తున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలోనూ బాగా రాణించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు కోసం అతడిని ఎంపిక చేసే అవకాశం ఉందని నేను వింటున్నాను. ఒకవేళ ఇది జరిగితే, రవీంద్ర జడేజా జట్టుకు దూరమయ్యే అవకాశం ఉంది" అని అన్నారు.

రవీంద్ర జడేజా విషయానికి వస్తే, అతడు ఇప్పటికే టీ20లకు వీడ్కోలు పలికాడు. 36 ఏళ్ల జడేజా బ్యాటింగ్‌లో గతంలో ఉన్నంత దూకుడు కనిపించడం లేదు. అయితే, బౌలర్‌గా మాత్రం అతడు ఇంకా మంచిగానే ఆడుతున్నాడు. 2023లో అతని బౌలింగ్ సగటు 28.19గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: