సెలబ్రిటీల జీవితాల్లో చిన్న సంఘటన కూడా పెద్ద సంచాలనంగా మారటం కామనే. ఇటీవల యూట్యూబర్ ఆర్జే మహవాష్, క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌తో క్రిస్మస్ వేడుకల్లో కనిపించడంతో ఒక్కసారిగా డేటింగ్ రూమర్లు వెల్లువెత్తాయి. వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వారి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందని కొందరు ప్రచారం మొదలుపెట్టేశారు. మరోవైపు చాహల్ తన భార్య ధనశ్రీ వర్మకు దూరమయ్యాడని త్వరలో వారు విడాకులు కూడా ప్రకటించే అవకాశముంది ఊహాగానాలు ఇప్పటికే చక్కర్లు కొడుతున్నాయి. ఈ సమయంలో మహవాష్, చాహల్‌తో కనిపించడం అనేక అనుమానాలకు తావిచ్చింది.

ఈ రూమర్లపై తాజాగా మహవాష్ స్పందించారు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఈ వార్తలను ఆమె ఖండించారు. తనపై వస్తున్న ట్రోలింగ్‌ను కూడా ఆమె తప్పుబట్టారు. "ఈ రూమర్లు ఎంత నిరాధారమైనవో చూస్తుంటే నవ్వొస్తోంది. మీరు ఆపోజిట్ జెండర్ వ్యక్తితో కనిపిస్తే వెంటనే డేటింగ్ చేస్తున్నారని ఎలా అనుకుంటారు? మనం ఏ కాలంలో ఉన్నాం? ఈ లాజిక్ ప్రకారం చూస్తే, మీరందరూ ఎంతమందితో డేటింగ్ చేస్తున్నారు?" అంటూ ఆమె ప్రశ్నించారు.

"నేను రెండు మూడు రోజులుగా మౌనంగా ఉన్నాను. కానీ ఇతరుల ఇమేజ్‌ను కాపాడటానికి నా పేరును ఈ వ్యవహారంలోకి లాగడానికి నేను ఎప్పటికీ ఒప్పుకోను. కష్ట సమయంలో ఉన్న వ్యక్తులను వారి స్నేహితులు, కుటుంబాలతో శాంతిగా ఉండనివ్వండి," అని మహవాష్ తన ప్రకటనలో పేర్కొన్నారు. క్రిస్మస్ రోజున మహవాష్ తన సెలబ్రేషన్స్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అందులో చాహల్ ఆమె పక్కనే కూర్చొని క్రిస్మస్ లంచ్‌ను ఆస్వాదిస్తూ కనిపించారు. ఆ పోస్ట్‌కు ఆమె "క్రిస్మస్ లంచ్ కాన్ ఫెమిలియర్" అని క్యాప్షన్ ఇచ్చారు.

యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మల మధ్య వివాహ బంధం సరిగా లేదని అభిమానులు మొదట గమనించింది వారు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో. ఆ తరువాత చాహల్ ధనశ్రీతో ఉన్న ఫోటోలన్నింటినీ తన సోషల్ మీడియా ఖాతా నుండి తొలగించడంతో ఈ ఊహాగానాలు మరింత బలపడ్డాయి. అయితే ధనశ్రీ మాత్రం ఇప్పటికీ తన ప్రొఫైల్‌లో చాహల్‌తో ఉన్న కొన్ని పోస్ట్స్‌ అలానే ఉంచేసింది. ఈ క్లిష్ట సమయంలో తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని ఇద్దరూ అభిమానులను కోరుతూ వేర్వేరు పోస్ట్‌లు పెట్టడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: