టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు ఎదురుగాలి వీస్తోంది. వచ్చే నెలలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అతని పదవిని రివ్యూ చేయడానికి బీసీసీఐ సిద్ధమయ్యింది. జట్టులో పేరుకుపోయిన సూపర్ స్టార్ కల్చర్ ను రూపుమాపడానికి గంభీర్ ప్రయత్నించడం వల్లే ఆటగాళ్ల మధ్య టెన్షన్ పెరిగిపోతోందని టాక్. గతేడాది జులైలో గంభీర్ కోచ్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టీమిండియా ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఆడిన పది టెస్టుల్లో ఆరింట ఓడిపోగా, శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌ను కూడా చేజార్చుకుంది.

పూర్ ప్రదర్శనలతో పాటు, ఫామ్ లో లేని స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల భవిష్యత్తుపై కూడా ప్రశ్నలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో సీనియర్ ఆటగాళ్లతో గంభీర్ కు గొడవలు జరిగాయనే వార్తలు వచ్చాయి. ఆ సిరీస్‌లో భారత్ 1-3 తేడాతో ఓడిపోవడంతో గంభీర్ పై విమర్శలు వెల్లువెత్తాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా సరిగ్గా ఆడకపోతే గంభీర్ కోచ్ పదవి కచ్చితంగా గల్లంతయ్యే ప్రమాదం ఉందని ఓ బీసీసీఐ సీనియర్ అధికారి తెలిపారు. వాస్తవానికి గంభీర్ కాంట్రాక్ట్ 2027 ప్రపంచ కప్ వరకు ఉంది. కానీ, కోచ్ గా అతడు ఫెయిల్ అయితే మాత్రం బీసీసీఐ అతన్ని నిర్మొహమాటంగా ఇంటికి సాగనంపుతుంది.

సూపర్ స్టార్ కల్చర్‌ను లేకుండా చేసేందుకు గంభీర్ అనుసరిస్తున్న పద్ధతులు కొందరు ఆటగాళ్లకు నచ్చడం లేదు. 2012 ఐపీఎల్ ఫైనల్‌లో బ్రెండన్ మెకల్లమ్‌ను కేకేఆర్ కెప్టెన్‌గా తప్పించడం లాంటి హార్ట్ బ్రేకింగ్ నిర్ణయాలు తీసుకోవడంలో గంభీర్ ముందు ఉంటాడు. అదేవిధంగా, ఢిల్లీ రంజీ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న సమయంలో, ఓ సీనియర్ ఆటగాడు అనుకూలమైన పిచ్ కావాలని కోరితే పట్టించుకోకుండా, కఠినమైన పిచ్‌పైనే మ్యాచ్‌లు ఆడాలని గంభీర్ పట్టుబట్టాడు. జట్టు ఎంపిక విషయంలో గంభీర్ తీరుపై సెలక్షన్ కమిటీ కూడా చాలా కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. గంభీర్ కఠినమైన పద్ధతులు గతంలో కోచ్ గా పనిచేసిన గ్రెగ్ చాపెల్ వ్యవహారాన్ని గుర్తు చేస్తున్నాయని వారంటున్నారు. అప్పుడు కూడా ఇలాగే గందరగోళం అయింది కదా అని చర్చించుకుంటున్నారు.

ఇది చాలదన్నట్టు, ఆస్ట్రేలియా పర్యటనలో గంభీర్ పర్సనల్ అసిస్టెంట్ ఎక్కువ జోక్యం చేసుకోవడం బీసీసీఐకి నచ్చలేదు. దీంతో జట్టులో టెన్షన్ మరింత పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఛాంపియన్స్ ట్రోఫీ బరిలోకి దిగుతోంది టీమిండియా. ఈ టోర్నీలో రాణిస్తేనే గంభీర్ పీఠం పదిలంగా ఉంటుంది. లేదంటే మాత్రం మార్పులు తప్పకపోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: