భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తాజాగా ఒక  సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో ఇంగ్లాండ్‌తో జరిగే హోమ్ సిరీస్‌కు సీతాన్షు కోటక్‌ను బ్యాటింగ్ కోచ్‌గా నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఈ సిరీస్‌లో 5 టీ20 మ్యాచ్‌లు, 3 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. జనవరి 22న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. అందుకే ఇండియన్ టీమ్‌ జనవరి 18న కోల్‌కతాకు చేరుకుని, సిరీస్ ప్రారంభానికి ముందు మూడు రోజుల ట్రైనింగ్ తీసుకుంటుంది.

ప్రస్తుతానికి భారత జట్టుకు గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తుండగా, అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డోషేట్ అసిస్టెంట్ కోచ్‌లుగా ఉన్నారు. మోర్నే మోర్కెల్ బౌలింగ్ కోచ్‌గా, టి. దిలీప్ ఫీల్డింగ్ కోచ్‌గా కొనసాగుతున్నారు. అయితే, బ్యాటింగ్ విభాగంలో మరింత పటిష్టత కోసం ప్రత్యేక బ్యాటింగ్ కోచ్‌ని నియమించాలని bcci భావించింది. ఈ నేపథ్యంలోనే సీతాన్షు కోటక్‌ను సెలెక్ట్ చేసింది. ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా 1-3 తేడాతో టెస్ట్ సిరీస్‌ను కోల్పోయాక జట్టు సహాయక సిబ్బందిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.

సౌరాష్ట్రకు చెందిన సీనియర్ ఆటగాడైన సీతాన్షు కోటక్ గతంలో ఇండియా ‘ఎ’ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశారు. అతనికి బ్యాటింగ్ టెక్నిక్‌పై మంచి పట్టు ఉంది. లిస్ట్ ‘ఎ’ మ్యాచ్‌లలో 42.33 సగటుతో 3,083 పరుగులు చేశాడు, అందులో హైయ్యెస్ట్ స్కోరు 122 నాటౌట్. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 8,000కు పైగా పరుగులు సాధించి, నిలకడగా బ్యాటింగ్ చేసే ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత భారత మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సైతం భారత కోచింగ్ సిబ్బందిపై విమర్శలు గుప్పించారు. టీమ్ బ్యాటింగ్‌ను మెరుగుపరచడంలో వారి పాత్రపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కోచింగ్ సిబ్బందిలో మార్పులు అవసరమని సూచించారు. దీంతో సీతాన్షు కోటక్ నియామకం చర్చనీయాంశంగా మారింది.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత భారత జట్టు ఆడుతున్న తొలి సిరీస్ ఇదే కావడం విశేషం. సొంతగడ్డపై ఇంగ్లాండ్‌ను ఎదుర్కోవడానికి టీమిండియా సిద్ధమవుతోంది. సీతాన్షు కోటక్ రాకతో బ్యాటింగ్ విభాగం మరింత బలోపేతం అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సిరీస్‌లో భారత్ ఎలా రాణిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: