భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సంచలన నిర్ణయం తీసుకుంది. టీమిండియా ప్లేయర్ల పై కొత్త క్రమశిక్షణ నిబంధనలను అమల్లోకి తెచ్చింది. కుటుంబ ప్రయాణాలు, లగేజీ పరిమితులు, వ్యక్తిగత యాడ్ షూటింగ్స్‌పై కఠిన ఆంక్షలు విధిస్తూ బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం.. ప్లేయర్ల ప్రత్యేక హక్కులకు కళ్లెం వేయనుంది. ఈ కొత్త రూల్స్ తో ఆటగాళ్లు గతంలో అనుభవించిన చాలా సౌకర్యాలు ఇకపై అందుబాటులో ఉండవు.

ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. సిరీస్‌ను 1-3 తేడాతో కోల్పోవడమే కాకుండా.. తొలిసారి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. ఈ సిరీస్‌లో ప్లేయర్ల మధ్య క్రమశిక్షణ లోపించిందని, డ్రెస్సింగ్ రూమ్‌లో ఐక్యత కరువైందని పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేశాయి. దీంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఒక రివ్యూ మీటింగ్ పెట్టి, అందులో జట్టు సమన్వయం సరిగా లేదని, ఆటగాళ్లు కలిసి ఎక్కువ సమయం గడపడం లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. 2-నెలల పర్యటనలో కేవలం ఒక్క టీమ్ డిన్నర్ మాత్రమే ఏర్పాటు చేయడాన్ని తప్పుబట్టాడు.

క్రమశిక్షణను పెంచడానికి, ప్లేయర్ల అనుబంధాన్ని బలోపేతం చేయడానికి బీసీసీఐ కుటుంబ ప్రయాణాలపై కఠినమైన రూల్స్ తీసుకొచ్చింది. ఆరోజు ప్రకారం, 45 రోజుల కంటే ఎక్కువ ఉండే విదేశీ పర్యటనలకు వెళ్లే ఆటగాళ్లు మాత్రమే సిరీస్‌లో ఒకసారి తమ పార్ట్‌నర్ ని, 18 ఏళ్లలోపు పిల్లలను రప్పించుకోవచ్చు. ఆ విజిట్ గరిష్టంగా 2 వారాలు మాత్రమే ఉంటుంది.

ప్లేయర్లు వారి కుటుంబ సభ్యుల కోసం ఉమ్మడి వసతిని మాత్రమే బీసీసీఐ భరిస్తుంది. మిగతా ఖర్చులన్నీ ఆటగాడే పెట్టుకోవాలి. కుటుంబ సభ్యుల సందర్శన ఒకేసారి, అందరూ అంగీకరించిన సమయంలో జరగాలి. సందర్శన తేదీలను కోచ్, కెప్టెన్, జనరల్ మేనేజర్ ఆపరేషన్స్ ఆమోదించాలి. స్పెషల్ రిక్వెస్ట్‌లు ఏమైనా ఉంటే వాటికి ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. కానీ అదనపు ఖర్చులను మాత్రం బీసీసీఐ భరించదు.

ఇకపై టీమిండియా ప్లేయర్లు పర్యటన లేదా సిరీస్ సమయంలో వ్యక్తిగత ప్రకటనల షూటింగ్స్, ఎండార్స్‌మెంట్లలో పాల్గొనకూడదు. ప్లేయర్లు పూర్తిగా క్రికెట్‌పై, జట్టు బాధ్యతలపై దృష్టి పెట్టాలనేది బీసీసీఐ ఉద్దేశం.

ఈ కొత్త మార్గదర్శకాల ముఖ్య ఉద్దేశం క్రమశిక్షణను మెరుగుపరచడం, జట్టుగా కలిసికట్టుగా ఆడేలా చూడటం, తద్వారా జట్టు మొత్తం ప్రదర్శనను మెరుగుపరచడం. ఆటగాళ్లు ఇకపై విధుల్లో ఉన్నప్పుడు వ్యక్తిగత ఆసక్తుల కంటే జట్టు నిబద్ధతలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: