టీమిండియా ఈ మధ్య సరిగ్గా ఆడట్లేదు. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో ఓడిపోయాక బీసీసీఐ సీరియస్ అయింది. ప్లేయర్లు సరిగ్గా ఉండట్లేదని కొన్ని కొత్త రూల్స్ పెట్టింది. ఇకపై కుర్రాళ్లే కాదు, కోహ్లీ, రోహిత్ లాంటి పెద్ద ఆటగాళ్లు కూడా ఆ రూల్స్ పాటించాల్సిందే.

ఇంతకీ ఆ రూల్స్ ఏంటంటే, ముందు దేశవాళీ క్రికెట్ ఆడటం తప్పనిసరి. అవును, జాతీయ జట్టులో ఆడాలన్నా, బీసీసీఐ కాంట్రాక్టులు పొందాలన్నా దేశవాళీ మ్యాచ్‌లు ఆడటం కంపల్సరీ. దీనివల్ల కొత్త టాలెంట్ బయటకొస్తుంది, ఆటగాళ్లు ఫిట్‌గా ఉంటారు, దేశంలో క్రికెట్ కూడా బాగుంటుంది. ఒకవేళ ఎవరైనా ఆడలేకపోతే, సెలక్షన్ కమిటీ ఛైర్మన్ దగ్గర ముందు పర్మిషన్ తీసుకోవాలి.

ఇకపై ఆటగాళ్లు మ్యాచ్‌లకి వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు అందరూ టీమ్‌తోనే వెళ్లాలి. ఫ్యామిలీతో సెపరేట్‌గా వెళ్లాలంటే కుదరదు. అలాగే, పర్సనల్ స్టాఫ్ కూడా ఎక్కువ మంది ఉండకూడదు. మేనేజర్లు, చెఫ్‌లు, సెక్యూరిటీ గార్డులు.. వీళ్లందరికీ బీసీసీఐ పర్మిషన్ ఉంటేనే అనుమతిస్తారు. దీనివల్ల టీమ్ అందరూ కలిసి ఉంటారు, ఎవరికి పడితే వాళ్ళు వచ్చి ఇబ్బంది పెట్టకుండా ఉంటారు.

లగేజీ విషయంలో కూడా రూల్స్ పెట్టారు. ఎక్కువ రోజులు టూర్ ఉంటే ఐదు బ్యాగులు (మూడు సూట్‌కేసులు, రెండు కిట్ బ్యాగులు) లేదా 150 కేజీల వరకు తీసుకెళ్లొచ్చు. తక్కువ రోజుల టూర్ అయితే నాలుగు బ్యాగులు (రెండు సూట్‌కేసులు, రెండు కిట్ బ్యాగులు) లేదా 120 కేజీల వరకు మాత్రమే అనుమతిస్తారు. ఎక్కువ బరువు ఉంటే ఆ డబ్బులు ఆటగాళ్లే కట్టుకోవాలి. అంతేకాదు, ప్రాక్టీస్‌కి వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు అందరూ కలిసి వెళ్లాలి. ప్రాక్టీస్ మొత్తం ఉండాలి. ఆట జరుగుతున్నప్పుడు పర్సనల్ షూటింగ్‌లు, యాడ్స్ లాంటివి చేయకూడదు.

ఈ రూల్స్ ఎవరైనా తప్పితే వాళ్లకి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. బీసీసీఐ నిర్వహించే టోర్నమెంట్లలో ఆడకుండా బ్యాన్ చేయొచ్చు లేదా వాళ్ల జీతంలో కోత విధించొచ్చు. అందుకే బీసీసీఐ ఈసారి చాలా సీరియస్‌గా ఉంది. ఆటగాళ్లు ప్రొఫెషనల్‌గా, క్రమశిక్షణతో ఉండాలని గట్టిగా చెబుతోంది. చూద్దాం.. ఈ రూల్స్ ఎంతవరకు ఫలితాన్ని ఇస్తాయో.

మరింత సమాచారం తెలుసుకోండి: