మొరాకో అధికారులు వీధి కుక్కలను చంపేందుకు అత్యంత క్రూరమైన పద్ధతులను ఉపయోగిస్తున్నారనే వార్తలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. విషపూరితమైన స్ట్రిక్నీన్ ఇచ్చి చంపడం, బహిరంగంగా కాల్చి చంపడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఒకవేళ ఆ దాడుల్లో కుక్కలు బతికి బయటపడితే, వాటిని గొడ్డళ్లతో కొట్టి చంపుతున్నారట. ఈ దారుణమైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇంటర్నేషనల్ యానిమల్ వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ కోయిలిషన్ ఈ ఊచకోతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఏకంగా 30 లక్షల కుక్కలను చంపేస్తారని హెచ్చరించింది. ప్రముఖ జంతు హక్కుల కార్యకర్త జేన్ గుడాల్ సైతం ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. ఫిఫా జోక్యం చేసుకోవాలని, ఈ ఊచకోత కొనసాగితే మొరాకోలో టోర్నమెంట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఫిఫాకు లేఖ కూడా రాశారు.
మొరాకో చట్టాల ప్రకారం వీధి కుక్కలను చంపడం నేరం. కానీ, అక్కడి అధికారులు మాత్రం చట్టాలను ఖాతరు చేయడం లేదు. స్థానిక పోలీసులు కూడా ఈ దారుణాలను అడ్డుకోవడం లేదని తెలుస్తోంది. జంతు సంరక్షణ సంస్థలు మాత్రం కుక్కలను పట్టుకుని, స్టెరిలైజేషన్ చేసి, టీకాలు వేసి తిరిగి వదిలిపెట్టే కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నాయి. అయితే, పెరుగుతున్న కుక్కల సంఖ్యతో షెల్టర్లు నిండిపోతున్నాయి. నిధులు కూడా సరిపోవడం లేదు.
ఈ ఘటనపై ఫిఫా ఇంకా స్పందించలేదు. కానీ, పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారని.. మొరాకోలోని వరల్డ్ కప్ వేదికలను తనిఖీ చేస్తున్నారని సమాచారం. మొరాకో మాత్రం వీధి కుక్కల సమస్యను పరిష్కరించేందుకు మరింత మానవత్వంతో కూడిన పద్ధతులను అవలంబించాలని అంతర్జాతీయ సమాజం డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో ఫిఫా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.