విదర్భతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అభినవ్ కర్ణాటక జట్టు తరఫున దుమ్మురేపాడు. కేవలం 42 బంతుల్లోనే 79 పరుగులు చేశాడు, అది కూడా 10 బౌండరీలు, 4 సిక్సర్లతో సాధించడం విశేషం. ఇక ఈ యంగ్ అండ్ డైనమిక్ ప్లేయర్ స్ట్రైక్ రేట్ చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే, అది ఎంత అంటే ఏకంగా 188.10. తన స్కోరింగ్‌లో దాదాపు 81.01% పరుగులు బౌండరీల ద్వారానే వచ్చాయి. అంటే దాదాపు ప్రతి మూడు బంతులకు ఒక బౌండరీ బాదేశాడు. టాప్ ఆర్డర్, మిడిలార్డర్ బ్యాటర్లు వేసిన పునాదిపై అభినవ్ తన విధ్వంసకర ఇన్నింగ్స్‌తో కర్ణాటక 50 ఓవర్లలో 348/6 భారీ స్కోరు చేయడానికి కీలక పాత్ర పోషించాడు.
చివరి ఓవర్లలో అభినవ్ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ జట్టుకు చాలా అవసరమైంది. ప్రతి దిక్కూ బౌండరీలు బాదుతూ, ఒత్తిడిలోనూ బౌలర్లను డామినేట్ చేస్తూ అతను ఆడిన తీరు చూస్తే, ఎందుకు SRH అతడి కోసం ఇంత భారీగా ఖర్చు చేసిందో అర్థమవుతుంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి లాంటి ఆటగాళ్లున్న SRH బ్యాటింగ్ లైనప్‌లో ఇప్పుడు అభినవ్ రూపంలో ఒక అదిరిపోయే ఫినిషర్ చేరాడు.
ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఇతర ఐపీఎల్ ప్లేయర్లు కూడా తమ టాలెంట్ చూపించారు. ముంబై ఇండియన్స్ కొనుక్కున్న కృష్ణన్ శ్రీజిత్ కర్ణాటక విజయంలో కీలక పాత్ర పోషించాడు. నెంబర్ 5లో బ్యాటింగ్‌కు దిగిన శ్రీజిత్ 74 బంతుల్లో 78 పరుగులు చేశాడు. అందులో 9 ఫోర్లు, 1 సిక్సర్ ఉన్నాయి. జట్టు 67 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన కష్ట సమయంలో శ్రీజిత్ నిలకడగా ఆడి జట్టును ఆదుకున్నాడు. స్మరణ్ రవిచంద్రన్‌తో కలిసి 160 పరుగుల పార్ట్‌నర్ షిప్ నెలకొల్పాడు. స్మరణ్ కూడా సెంచరీ కొట్టేశాడు.
శ్రీజిత్ ఆడిన ఇన్నింగ్స్ వల్ల అభినవ్ మనోహర్ లాంటి హిట్టర్లు చెలరేగిపోయేందుకు మంచి వేదిక లభించింది. శ్రీజిత్, మనోహర్ ఇద్దరూ ఒత్తిడిలో అద్భుతంగా ఆడి ఫైనల్ మ్యాచ్‌లో తమదైన ముద్ర వేశారు.