ప్రముఖ భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అప్‌కమింగ్ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ టీమ్ తన ఫేవరెట్‌ అని చెప్పి యావత్ భారతదేశాన్ని షాక్‌కి గురిచేశాడు. దీనికి ఆయన ఒక బలమైన కారణం చెబుతున్నారు. పాకిస్థాన్ సొంతగడ్డపై ఆడే అవకాశం ఉండటమే ఆ జట్టుకు కలిసొచ్చే అంశం అంటున్నారు. ఫిబ్రవరి 19 నుంచి ఈ ప్రతిష్టాత్మక టోర్నీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి పాకిస్థాన్, యూఏఈలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అంతేకాదు, 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థానే విన్నర్ గా నిలిచింది.

2017లో లండన్‌లోని ఓవల్ మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాను ఓడించి పాక్ తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇప్పుడు మళ్లీ ఈ టోర్నీ పాకిస్థాన్‌లో జరుగుతుండటంతో, సొంతగడ్డపై ఆడేటప్పుడు పాకిస్థాన్‌కు ఉండే అడ్వాంటేజ్‌ను తక్కువగా అంచనా వేయలేమని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ "సొంతగడ్డపై ఆడే పాకిస్థాన్‌ను ఓడించడం చాలా కష్టం. అందుకే వాళ్లే నా ఫేవరెట్స్ అవుతారు" అని ఆయన అన్నారు.

ఇటీవలి కాలంలో టీమిండియా ప్రదర్శనపై కూడా గవాస్కర్ స్పందించారు. 2023 వన్డే ప్రపంచ కప్‌లో భారత్ అద్భుతమైన ఆటతీరును కనబరిచిందని, ఫైనల్‌కు చేరే వరకు పది మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిందని ఆయన ప్రశంసించారు. అయినా, ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌కు సొంత పరిస్థితులపై ఉన్న పట్టు వల్ల ఆ జట్టుకు తిరుగుండదని గవాస్కర్ బలంగా నమ్ముతున్నారు.

2024 ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ Aలో భారత్, పాక్‌, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ఉన్నాయి. గ్రూప్ Bలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడనున్నాయి. దుబాయ్‌లో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరగనుంది.

పాకిస్థాన్‌లోని రావల్పిండి, లాహోర్, కరాచీ నగరాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఒకవేళ భారత్ సెమీఫైనల్‌కు చేరుకుంటే, మార్చి 4న ఆడుతుంది. ఇక ఫైనల్ మ్యాచ్ దుబాయ్‌లో జరగనుంది. టోర్నీ సమీపిస్తున్న తరుణంలో, సొంతగడ్డపై ఆడే అవకాశం ఫలితాలను శాసించే అంశంగా మారే అవకాశముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: