హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన ఈ వేడుకకు కేవలం 40-50 మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. "మా ఇద్దరినీ ఈ క్షణం వరకు తీసుకొచ్చిన ప్రతి ఆశీర్వాదానికి కృతజ్ఞతలు. ప్రేమతో సంతోషంగా జీవిస్తాం" అంటూ ఈ జావెలిన్ త్రో స్టార్ అథ్లెట్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తమ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా అభిమానుల ఆదరణ, దీవెనలు కావాలని కోరాడు.
నీరజ్ పెళ్లాడిన హిమానీ మోర్ వయసు 25 ఏళ్లు. ఆమె ఓ టెన్నిస్ ప్లేయర్. హర్యానాలోని సోనిపత్‌కు చెందిన హిమానీ, అక్కడి లిటిల్ ఏంజెల్స్ స్కూల్‌లో విద్యాభ్యాసం చేసింది. ప్రస్తుతం అమెరికాలోని న్యూ హాంప్‌షైర్‌లోని ఫ్రాంక్లిన్ పియర్స్ యూనివర్సిటీలో స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ చేస్తోంది. అంతకుముందు ఢిల్లీలోని మిరాండా హౌస్‌లో పొలిటికల్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది. హిమానీ తండ్రి చంద్ రామ్ సోనిపత్‌కు చెందినవారు. ఆమె సోదరుడు హిమాన్షు కూడా టెన్నిస్ ప్లేయరే.
హిమానీ టెన్నిస్ కెరీర్‌లో కొన్ని విజయాలు సాధించింది. 2017లో తైపీలో జరిగిన వరల్డ్ యూనివర్శిటీ గేమ్స్‌లో పాల్గొంది. జాతీయ స్థాయిలో ఢిల్లీ యూనివర్సిటీకి ప్రాతినిధ్యం వహించింది. ఆమె స్కూల్ వెబ్‌సైట్ ప్రకారం, 2016లో మలేషియాలో జరిగిన వరల్డ్ జూనియర్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ గెలుచుకుంది. ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ (AITA) వెబ్‌సైట్ ప్రకారం, 2018లో ఆమె బెస్ట్ నేషనల్ ర్యాంకింగ్ సింగిల్స్‌లో 42, డబుల్స్‌లో 27గా ఉంది. 2018లోనే ఆమె AITA ఈవెంట్లలో ఆడటం మొదలుపెట్టింది.
ఆటలతో పాటు హిమానీకి కోచింగ్ అనుభవం కూడా ఉంది. అమెరికాలోని మసాచుసెట్స్‌లోని అమర్‌స్ట్ కాలేజీలో మహిళల టెన్నిస్‌కు అసిస్టెంట్ కోచ్‌గా పనిచేసింది. చదువుకుంటూనే పని అనుభవం పొందేందుకు వీలు కల్పించే ప్రోగ్రామ్‌లో భాగంగా ఆమె ఈ బాధ్యతలు నిర్వర్తించింది.
నీరజ్, హిమానీ తమ పెళ్లికి సంబంధించిన మరిన్ని వివరాలను ప్రైవసీగా ఉంచారు. కచ్చితమైన వేడుక జరిగిన ప్రదేశం, హనీమూన్ ప్లాన్‌ల గురించి ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. హిమానీ కుటుంబ సభ్యులు కూడా ఈ విషయంపై మౌనంగా ఉన్నారు. అయితే నీరజ్ సన్నిహిత వర్గాలు మాత్రం పెళ్లి భారతదేశంలోనే జరిగిందని క్లారిటీ ఇచ్చేసాయి. దీంతో దేశవ్యాప్తంగా నీరజ్ అభిమానులు, క్రీడాభిమానులు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.