ఎవరైనా చనిపోయి మళ్లీ బతుకుతారా అంటే అసాధ్యం అని మనం అంటాం కానీ భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కోచ్ డబ్ల్యూ.వి. రామన్ ఇటీవల తన జీవితంలో ఇలాంటి భయానక ఘటన చోటు చేసుకుందని చెప్పారు. ఒక సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్ కోసం తీసుకున్న మందులు తన ప్రాణాలకే ముప్పు తెచ్చాయని వెల్లడించారు. ఈ షాకింగ్ విషయాన్ని స్వయంగా అతనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' ద్వారా తెలియజేశారు. ఒక చిన్న ఆరోగ్య సమస్య ఎలా తనను మృత్యువు అంచుల వరకు తీసుకెళ్లిందో రామన్ వివరించారు. ఈ ఎక్స్పీరియన్స్ చనిపోయి బతికినట్లే అనిపించిందని పేర్కొన్నారు.

భారత జట్టు తరఫున 38 మ్యాచ్‌లు ఆడి 1000కు పైగా పరుగులు చేసిన రామన్.. జనవరి ప్రారంభంలో వైరల్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతూ వైద్యుడిని సంప్రదించారు. డాక్టర్ సూచించిన మందులను తిన్న తర్వాత, దాదాపు రెండు గంటల తర్వాత తన శరీరంపై దద్దుర్లు రావడం గమనించారు. దీంతో వెంటనే డాక్టర్‌కు ఫోన్ చేయగా.. ఆయన వెంటనే ఆసుపత్రికి వచ్చి ఇంజెక్షన్ తీసుకోవాలని సూచించారు. మొదట కాస్త నిర్లక్ష్యం చేసినా, రక్తం ముఖంలోకి ఒక్కసారిగా ఉరుకుతున్న భావన కలగడంతో రామన్ వెంటనే అప్రమత్తమయ్యారు. ఛాతీలో అసౌకర్యంగా ఉన్నా, స్వయంగా కారు నడుపుకుంటూ 3 కి.మీ దూరంలో ఉన్న ఆసుపత్రికి చేరుకున్నారు.

ఆసుపత్రిలో వైద్యులు వెంటనే ఇంజెక్షన్ ఇచ్చారు. అయితే ఆ ఇంజెక్షన్ చేసిన కొద్దిసేపటికే రామన్ పరిస్థితి మరింత విషమంగా మారింది. అప్పటివరకు ఉన్నది కాస్త అలెర్జీ అనుకుంటే అది కాస్తా ఒక్కసారిగా ప్రాణాంతక స్థాయికి చేరుకుంది. వెంటనే స్పందించిన వైద్య సిబ్బంది.. అది ‘అనాఫిలాక్టిక్ షాక్’ అని గుర్తించారు. ఆ సమయంలో రామన్ దాదాపు 45-60 సెకన్ల పాటు స్పృహ కోల్పోయారు. అయితే అదృష్టవశాత్తూ, వైద్యుల సకాలంలో చేసిన చికిత్సతో ఆయన మళ్లీ స్పృహలోకి వచ్చారు.

ప్రస్తుతం రామన్ పూర్తిగా కోలుకున్నారు. జనవరి 10 నుంచి 15 వరకు రాజ్‌కోట్‌లో జరిగిన భారత్, ఐర్లాండ్ మహిళల వన్డే సిరీస్‌కు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు. ఈ సందర్భంగా రామన్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ అలెర్జీలను తీవ్రంగా పరిగణించాలని, తమకు ఉన్న అలెర్జీల గురించి కుటుంబ సభ్యులు, స్నేహితులు, వైద్యులకు తెలియజేయాలని సూచించారు. జీవితం క్షణాల్లో ఎలా మారుతుందో ఈ సంఘటన ద్వారా తెలుసుకోవచ్చని, శరీరం ఇచ్చే సంకేతాలను గుర్తించి వెంటనే స్పందించడం చాలా ముఖ్యమని రామన్‌ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: