బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్‌కు ఊహించని షాక్ తగిలింది. అతనికి పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. 3 లక్షల డాలర్లకు పైగా విలువైన చెక్కులు బౌన్స్ కావడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఇది షకీబ్‌కు మరో ఎదురుదెబ్బ అని అంటున్నారు. ఇప్పటికే రాజకీయ పదవి కోల్పోయిన ఆయనకు ఇది మరింత గడ్డుకాలాన్ని తెచ్చిపెట్టింది.

ఈ కేసును ఐఎఫ్ఐసీ బ్యాంక్ దాఖలు చేసింది. షకీబ్‌ను గతంలో కోర్టుకు పిలిచినా హాజరుకాలేదని, అందుకే అరెస్ట్ వారెంట్ జారీ చేయాల్సి వచ్చిందని బ్యాంక్ ప్రతినిధి మహమ్మద్ షాహిబుర్ రెహ్మాన్ తెలిపారు. ఇంతకుముందు షేక్ హసీనా నేతృత్వంలోని పార్టీ తరపున చట్టసభ సభ్యుడిగా షకీబ్ ఉన్నారు. అయితే, 2024, ఆగస్టులో జరిగిన తిరుగుబాటులో హసీనా అధికారం కోల్పోయింది, ఆ వెను వెంటనే ఆమె హెలికాప్టర్‌లో భారతదేశానికి పారిపోయారు.

హసీనాతో షకీబ్‌కు మంచి అనుబంధం ఉంది, అదే అతనికి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత తెచ్చి పెట్టింది. బంగ్లాదేశ్ లో గొడవలు జరిగిన సమయంలో పోలీసుల కాల్పులు జరిపారు. ఆ మరణించినవారికి సంబంధించిన హత్య కేసుల దర్యాప్తులో షకీబ్‌ పేరు కూడా ఉంది. అయితే, ఈ కేసుల్లో ఆయనపై ఇంకా ఎలాంటి నేరం రుజువు కాలేదు.

ప్రభుత్వం కూలిపోయే సమయానికి షకీబ్ కెనడాలో ఉన్నారు. అక్కడ ఒక డొమెస్టిక్ ట్వంటీ20 క్రికెట్ పోటీల్లో ఆడుతున్నారు. ఆ తర్వాత ఆయన బంగ్లాదేశ్‌కు తిరిగి రాలేదు.

షకీబ్ అల్ హసన్ బంగ్లాదేశ్‌కు చెందిన అత్యంత విజయవంతమైన క్రికెటర్లలో ఒకరు. ఆయన 71 టెస్టులు, 247 వన్డే ఇంటర్నేషనల్స్ (ఓడీఐలు), 129 ట్వంటీ20లు ఆడారు. ఈ ఫార్మాట్‌లలో కలిపి 712 వికెట్లు తీశారు. ఇంత గొప్ప రికార్డు ఉన్నా, వచ్చే నెలలో పాకిస్థాన్, దుబాయ్‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన 15 మంది జట్టులో షకీబ్‌కు చోటు దక్కకపోవడం గమనార్హం.

ఈ టోర్నమెంట్‌లో బంగ్లాదేశ్ జట్టుకు నజ్ముల్ హొస్సేన్ శాంటో నాయకత్వం వహిస్తారు. బంగ్లాదేశ్ గ్రూప్ 'ఎ'లో ఉంది. ఈ గ్రూప్‌లో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్ కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: