టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ దేశవాళీ క్రికెట్‌లో సందడి చేయనున్నాడు. ఢిల్లీ తరఫున ఆడేందుకు అతడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. జనవరి 30 నుంచి రైల్వేస్‌తో జరిగే కీలకమైన రంజీ ట్రోఫీ గ్రూప్ మ్యాచ్‌లో కోహ్లీ బరిలోకి దిగనున్నాడు. దీంతో గత కొంతకాలంగా కోహ్లీ రంజీల్లో ఆడతాడా లేదా అనే ఊహాగానాలకు తెర దించేస్తూ.. అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందించాడు.

నిజానికి ఢిల్లీ జట్టు జనవరి 23 నుంచి సౌరాష్ట్రతో ఒక ముఖ్యమైన మ్యాచ్ ఆడనుంది. కానీ, కోహ్లీ మాత్రం తన సొంతగడ్డపై జరిగే రైల్వేస్‌తో మ్యాచ్ నుంచే జట్టుతో కలవనున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రోహన్ జైట్లీ, ఢిల్లీ కోచ్ శరణ్‌దీప్ సింగ్ అధికారికంగా ఖరారు చేశారు.

ఇటీవల బీసీసీఐ తీసుకొచ్చిన కొత్త నిబంధనలే కోహ్లీ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం. భారత క్రికెట్ జట్టులో స్థానం దక్కించుకోవాలంటే ఆటగాళ్లు దేశవాళీ టోర్నీల్లో తప్పకుండా ఆడాలనేది ఆ నిబంధనల సారాంశం. దీంతో సీనియర్ ఆటగాళ్లు కూడా మళ్లీ రంజీ ట్రోఫీ బరిలో కనిపించనున్నారు. కోహ్లీ గనుక రైల్వేస్‌తో మ్యాచ్ ఆడితే.. దాదాపు 12 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో ఆడినట్టవుతుంది. చివరిసారిగా 2012 నవంబర్‌లో ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు రంజీ ఆడాడు. 2011లో టెస్ట్ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన తర్వాత కోహ్లీ ఆడింది కేవలం ఒక్క రంజీ మ్యాచ్ మాత్రమే.

గత కొన్నేళ్లుగా బిజీ షెడ్యూల్స్‌ను సాకుగా చూపిస్తూ చాలామంది సీనియర్ ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌కు దూరంగా ఉంటున్నారు. కొందరైతే ఈ మ్యాచ్‌లను పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ, టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మద్దతుతో బీసీసీఐ తీసుకొచ్చిన ఈ కొత్త విధానం మాత్రం జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలంటే దేశవాళీ క్రికెట్‌లో ఆడటం తప్పనిసరి చేసింది.

దేశవాళీ మ్యాచ్‌లు ఆడటం వల్ల సీనియర్ ప్లేయర్లకే కాదు, యువ ఆటగాళ్లకు కూడా ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. సీనియర్ ప్లేయర్లు ఫామ్ అందుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాదు, యువ క్రికెటర్ల ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న ఆటగాళ్లతో కలిసి ఆడే అవకాశం రావడంతో.. కుర్రాళ్లకు విలువైన అనుభవం లభిస్తుంది. ఈ కొత్త విధానం వల్ల భారత క్రికెట్‌లో ఆటతీరు మెరుగవుతుందని, యువ ఆటగాళ్ల అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: