ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా టెన్నిస్ ప్లేయర్ హిమానీ మోర్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.  జనవరి 14 నుంచి 16 వరకు హిమాచల్ ప్రదేశ్‌లోని అందమైన పర్వత ప్రాంతంలో చాలా ప్రైవేట్‌గా వీరి వివాహ వేడుకలు జరిగాయి. ఈ గుడ్ న్యూస్‌ను స్వయంగా నీరజ్ తన సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులతో పంచుకున్నాడు. కొత్త జీవితం మొదలు పెడుతున్న తమకు అందరి ఆశీస్సులు కావాలని కోరాడు.

ఈ వేడుక చాలా సింపుల్‌గా జరిగింది. ఇరు కుటుంబాలకు చెందిన దగ్గరి బంధువులు మాత్రమే అంటే దాదాపు 65 నుంచి 70 మంది వరకు హాజరయ్యారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుక జనవరి 14న రింగ్ సెర్మనీతో మొదలైంది. జనవరి 15న హల్దీ వేడుక తర్వాత మెహందీ, డీజే నైట్‌తో సందడి చేశారు. ఇక జనవరి 16న మధ్యాహ్నం పెళ్లి తంతు పూర్తి కాగా, సాయంత్రానికి అతిథులంతా తిరుగు పయనమయ్యారు.

నీరజ్, హిమానీ అమెరికాలో కలుసుకున్నారని నీరజ్ అంకుల్ సురేంద్ర చోప్రా వెల్లడించారు. ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించడంతో నీరజ్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇది ప్రేమ, పెద్దలు కుదిర్చిన వివాహం అని ఆయన పేర్కొన్నారు. పెళ్లికి ముందు హిమానీ, నీరజ్ సొంతూరు హర్యానాకు వెళ్లింది. అక్కడ పెళ్లికి సంబంధించిన కొన్ని ఆచారాల్లో భాగంగా 14 గంటలు గడిపింది. ఈ పెళ్లి గురించి చాలా నెలల ముందు నుంచే ప్లాన్ చేసినా, చాలా ప్రైవేట్‌గా ఉంచారు. పూజలు చేసిన పూజారికి కూడా నీరజ్ ఎవరనే విషయం తెలియదంటే నమ్మండి.

ఇక అసలు విషయానికొస్తే, నీరజ్ కుటుంబం కట్నం అనే దురాచారానికి పూర్తి వ్యతిరేకం. అందుకే పెళ్లిలో కేవలం ఒక రూపాయిని మాత్రమే శుభసూచకంగా తీసుకున్నారట. ఇది నిజంగా గొప్ప విషయం. హిమానీ తల్లిదండ్రులు కూడా ఎలాంటి బహుమతులు, వస్తువులు ఇచ్చిపుచ్చుకోలేదని స్పష్టం చేశారు. ప్రేమ, గౌరవం మీద ఆధారపడిన బంధాన్ని వాళ్లు కోరుకున్నారని అర్థమవుతోంది.

నీరజ్ బిజీ షెడ్యూల్ కారణంగానే ఈ సమయంలో పెళ్లి చేసుకున్నారని సురేంద్ర చోప్రా చెప్పారు. రాబోయే రెండేళ్లలో వరుసగా పోటీలు ఉండటంతో ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. మొత్తానికి నీరజ్, హిమానీల పెళ్లితో మూడు రోజులు పర్వతాల మధ్య ఎంతో సంతోషంగా గడిపామని ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: