టీమిండియా క్రికెటర్ రింకు సింగ్ తన తండ్రికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. ఒకప్పుడు ఆయన తండ్రి ఖాన్‌చంద్ సింగ్ సిలిండర్లు డెలివరీ చేస్తూ కుటుంబాన్ని పోషించాడు. ఆ కష్టాలను కళ్లారా చూసిన రింకు, ఇప్పుడు ఆయన కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇచ్చాడు. ఏకంగా రూ.5 లక్షలకు పైగా విలువ చేసే కవాసకి నింజా 400 స్పోర్ట్స్ బైక్‌ను గిఫ్ట్ ఇచ్చాడు.

తండ్రి పడ్డ కష్టానికి కొడుకు ఇచ్చిన కానుక ఇది. ఒకప్పుడు ఆర్ధిక ఇబ్బందులతో సతమతమైన రింకు కుటుంబానికి ఆయన తండ్రే పెద్ద దిక్కు. రింకు స్టార్ క్రికెటర్‌గా ఎదిగినా, ఖాన్‌చంద్ సింగ్ మాత్రం ఇంకా సిలిండర్ డెలివరీ పని చేస్తూనే ఉండటం ఆశ్చర్యం. అతని నిరాడంబరతకు ఇది నిదర్శనం. అయితే, ఇప్పుడు ఆయనే స్వయంగా కొత్త స్పోర్ట్స్ బైక్‌పై డెలివరీలకు వెళ్తుండటం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక రింకు సింగ్ వ్యక్తిగత జీవితానికి వస్తే, త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడు. కెరకట్ ఎమ్మెల్యే తుఫానీ సరోజ్ కుమార్తె ప్రియా సరోజ్‌ను రింకు వివాహం చేసుకోనున్నాడు. ఇటీవలే ఫిబ్రవరి 16న అలీగఢ్‌లోని రింకు నివాసంలో ఇరు కుటుంబాల పెద్దలు సమావేశమై పెళ్లి గురించి చర్చించారు. ఇరు కుటుంబాలూ ఈ సంబంధానికి అంగీకరించడంతో గిఫ్ట్స్ కూడా ఇచ్చిపుచ్చుకున్నారు.

రింకు, ప్రియా గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. దాదాపు ఏడాదికి పైగా వీరిద్దరూ ఒకరికొకరు తెలుసు. వీరిద్దరి కామన్ ఫ్రెండ్ ఒక క్రికెటరే కావడం విశేషం. క్రమంగా వీరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. అయితే, పెద్దల అంగీకారం కోసం వేచి చూశారు.

పెళ్లి, ఎంగేజ్‌మెంట్ తేదీలు ఇంకా ఫైనలైజ్ కాలేదు. పార్లమెంట్ సమావేశాలు ముగిశాక లక్నోలో ఎంగేజ్‌మెంట్ జరిగే అవకాశముంది. ప్రస్తుతం రింకు జనవరి 22 నుంచి ఇంగ్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు సిద్ధమవుతున్నాడు. ఆ తర్వాత ఐపీఎల్‌లోనూ ఆడనున్నాడు. తన పెళ్లి ప్రణాళికలు తన క్రికెట్ కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపవని రింకు స్పష్టం చేశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: