టీమిండియా యువ సంచలనం తిలక్ వర్మ సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో బుధవారం ఇంగ్లండ్‌తో జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌లో 22 ఏళ్ల తిలక్ అరుదైన మైలురాయిని చేరుకునే అవకాశం ఉంది.

ఇప్పటికే టీ20ల్లో రెండు సెంచరీలు  బాదిన తిలక్ వర్మ.. గత నవంబర్‌లో సౌతాఫ్రికాపై 107*, 120* పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో మరో సెంచరీ చేస్తే, టీ20 చరిత్రలో మూడు వరుస సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేస్తాడు. ఈ ఘనత అతన్ని క్రికెట్‌లో మోస్ట్ పవర్ ఫుల్ బ్యాటర్ గా నిలబెడుతుంది.

5-మ్యాచ్‌ల ఈ సిరీస్ టీమిండియాకు చాలా కీలకం. టీమిండియా అందరికీ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నా, టీ20ల్లో తమ రికార్డును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా లేకపోవడంతో యువ ఆటగాళ్లపై ఒత్తిడి పెరిగింది.

అయితే, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి వంటి యంగ్ ప్లేయర్లు సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా మిడిలార్డర్‌లో తిలక్ నిలకడగా రాణిస్తున్నాడు. భారీ షాట్లు కొడుతూ, ఎక్కువసేపు క్రీజులో నిలబడే అతని సామర్థ్యం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై భారాన్ని తగ్గించింది. సూర్యకుమార్ మ్యాచ్ విన్నర్‌గా కొనసాగుతున్నాడు.

మరోవైపు, ఓపెనర్ సంజూ శాంసన్ కూడా ఫామ్‌లో ఉన్నాడు. తన గత 5 టీ20 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు సాధించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన అతను, ఈ సిరీస్‌లో తనను తాను ప్రూవ్ చేసుకోవాలని చాలా ట్రై చేస్తున్నాడు.

బౌలింగ్ విషయానికొస్తే, మహ్మద్ షమీ అనుభవం, అర్ష్‌దీప్ సింగ్ లెఫ్ట్ హ్యాండ్ పేస్ బౌలింగ్‌పై భారత్ ఆశలు పెట్టుకుంది. జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్ వంటి బ్యాటర్లతో నిండిన ఇంగ్లండ్ జట్టును కట్టడి చేయాల్సి ఉంది. ఇంగ్లండ్ జట్టు కూడా చాలా బలంగానే ఉంది. కోచ్ బ్రెండన్ మెకల్లమ్ సారథ్యంలో బరిలోకి దిగుతున్న ఈ జట్టులో జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్ వంటి స్టార్ పేసర్లు తిరిగి రావడంతో వారి బౌలింగ్ మరింత బలంగా తయారైంది. ఈ సిరీస్ లో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: