టీమిండియా సీనియర్ ప్లేయర్లు అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో చాలా చెత్తగా ఆడిన సంగతి తెలిసిందే. దీని ఫలితంగా వారిపై ఫ్యాన్స్‌ భారీ ఎత్తున విరుచుకుపడ్డారు. వారి విమర్శలను వీరిద్దరూ భరించలేకపోయినట్లున్నారు. అందుకే , ఈ ఇద్దరూ ఇప్పుడు ఎలాగైనామళ్లీ ఫామ్‌లోకి రావడానికి కంకణం కట్టుకున్నారు. ఆత్మవిశ్వాసం పెంచుకునేందుకు దేశవాళీ క్రికెట్‌ను వేదికగా ఎంచుకున్నారు.

ముంబై రంజీ జట్టుతో ప్రాక్టీస్ చేస్తున్న హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ 2015 తర్వాత తొలిసారిగా రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడనున్నాడు. జనవరి 23న జమ్మూ కశ్మీర్‌తో జరిగే మ్యాచ్‌లో ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఇప్పటికే 17 మందితో కూడిన జట్టును ప్రకటించగా అందులో రోహిత్ కీలక ఆటగాడిగా ఉన్నాడు. ముంబై రంజీ జెర్సీలో రోహిత్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రంజీ జెర్సీలో ఉన్న రోహిత్ శర్మని చూసి అందరూ ఫీల్ అవుతున్నారు. రోహిత్‌ను మళ్లీ దేశవాళీ క్రికెట్‌లో చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. టీమిండియాకు కెప్టెన్‌గా ఉన్నా, రోహిత్ ఈ మ్యాచ్‌లో అజింక్య రహానె సారథ్యంలో ఆడనున్నాడు.

ముంబై జట్టులో శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే వంటి స్టార్ ఆటగాళ్లు కూడా ఉన్నారు. దేశవాళీ క్రికెట్‌ను బలోపేతం చేయాలనే బీసీసీఐ ప్రయత్నాల్లో భాగంగానే ఈ పరిణామం చోటు చేసుకుంది. జాతీయ జట్టుకు ఆడని సమయంలో దేశవాళీ మ్యాచ్‌లు ఆడాలని బీసీసీఐ ఇటీవల ఆటగాళ్లను కోరింది.

ఇంకా విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ వంటి టాప్ ప్లేయర్లు కూడా రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నిర్ణయం ఆటగాళ్ల ఆటతీరును మెరుగుపరచడమే కాకుండా, దేశవాళీ క్రికెట్ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది. మొత్తానికి, స్టార్ ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ బాట పట్టడంతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: