ఈరోజు సాయంత్రం 7 గంటలకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ స్టార్ట్ కానుంది. బ్రెండన్ మెకల్లమ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంగ్లాండ్ టీమ్ సరికొత్త వైట్‌బాల్ క్రికెట్ శకానికి నాంది పలుకుతోంది. టెస్ట్ క్రికెట్‌లో తన అగ్రెసివ్ కోచింగ్ తో అదరగొట్టిన మెకల్లమ్ ఇక్కడ కూడా అదే తీరుతో ప్రత్యర్ధులను చిత్తుచేయాలని చూస్తున్నాడు.

టీమిండియా విషయానికొస్తే, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో జట్టు కొత్తగా కనిపిస్తోంది. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ వంటి యంగ్‌స్టర్స్ టాప్ ఆర్డర్‌లో బరిలోకి దిగనున్నారు. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో సీనియర్ ప్లేయర్లు రిటైర్మెంట్ ప్రకటించడంతో వీరిపైనే ప్రధానంగా దృష్టి ఉంది. అయితే, వీళ్లు తమ అద్భుతమైన ఫామ్‌తో ఆకట్టుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఆడిన 15 మ్యాచ్‌ల్లో 13 గెలిచి, చాలాసార్లు 200కు పైగా స్కోర్లు చేయడం ద్వారా భారత జట్టు బ్యాటింగ్ పటిష్టతను చాటింది.

ఈ సిరీస్‌లో అందరి దృష్టి ఎక్స్‌పీరియన్స్డ్‌ పేసర్ మహ్మద్ షమీపై ఉంది. 14 నెలల బ్రేక్ తర్వాత ఈ స్టార్ జట్టులోకి తిరిగి రానున్నాడు. గాయం కారణంగా శస్త్రచికిత్స చేయించుకున్న షమీ, మళ్లీ జట్టులోకి రావడం కోసం చాలా కష్టపడ్డానని, గాయాల వల్ల ఆటగాళ్లు మరింత బలపడతారని అన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ సమీపిస్తున్న తరుణంలో షమీ ప్రదర్శన కీలకం కానుంది. టీమిండియాను ఈ టి 20 సిరీస్ లో అతను గెలిపిస్తాడా అనేది ప్రస్తుతం అత్యంత ఆసక్తికర అంశంగా మారింది.

మరోవైపు జోస్ బట్లర్ నాయకత్వంలోని ఇంగ్లాండ్ జట్టు, టీమిండియాని మట్టి కరిపించాలని చూస్తోంది. బెన్ డకెట్ ఓపెనర్‌గా రానుండగా, జోఫ్రా ఆర్చర్ పేస్ బౌలింగ్‌లో కీలకం కానున్నాడు. 2023 ప్రపంచ కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా నిలవలేకపోయిన ఇంగ్లాండ్ జట్టు, ఈ సిరీస్‌తో మళ్లీ పుంజుకోవాలని భావిస్తోంది.

టీమిండియా వ్యూహంలో భాగంగా, బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చోటుచేసుకునే అవకాశముంది. ఓపెనర్లను మినహాయిస్తే, మ్యాచ్ పరిస్థితులను బట్టి 3-7 వరకు బ్యాటింగ్ స్థానాలు మారుతూ ఉంటాయి. దీని ద్వారా జట్టు వివిధ బౌలింగ్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కోగలదు. రెండు జట్లు దూకుడుగా ఆడేందుకు సిద్ధంగా ఉండటంతో, ఈరోజు మ్యాచ్ అభిమానులకు కనువిందు చేయనుంది. స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లో సాయంత్రం 7:00 గంటలకు మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: