ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన పండుగ అయిన మహా కుంభమేళా 2025 జనవరి 13న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ పవిత్ర హిందూ సంబరంలో కోట్లాది మంది భక్తులు పాల్గొంటున్నారు. ముఖ్యంగా గంగా, యమునా, పురాణ సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేయడం ఇక్కడ అత్యంత ముఖ్యమైన ఆచారం.

అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం ఏమిటంటే, కొందరు టీమిండియా క్రికెటర్లు సాధువుల్లా దర్శనమివ్వడం, అవును, నిజమే. ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ వంటి టాప్ క్రికెటర్లు కాషాయ వస్త్రాల్లో, నుదుటన విభూది రేఖలతో సాధువుల్లా కనిపిస్తున్న ఫొటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. @thebharatarmy అనే ఇన్‌స్టా పేజీ ఈ ఫొటోలను షేర్ చేయడంతో అవి క్షణాల్లో వైరల్ అయిపోయాయి. "మహా కుంభ మేళా క్రికెట్‌ను కలిసినప్పుడు!" అంటూ ఆ పేజీ క్యాప్షన్ కూడా పెట్టింది.

ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. నిజంగానే మన క్రికెటర్లు కుంభమేళాకి వెళ్లారా? అని ఆశ్చర్యపోయారు. చాలామంది ఈ ఫొటోలు నిజంగానే ఉన్నాయని నమ్మేశారు. కొందరైతే "ఫొటోలు చాలా రియలిస్టిక్‌గా ఉన్నాయి" అంటూ కామెంట్స్ పెట్టారు. మరికొందరు విరాట్ కోహ్లీ ఫోటో చూసి "నవ్వాపుకోలేకపోతున్నా" అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు. అయితే, ఇది AI మాయ అని కొందరు వెంటనే కనిపెట్టేశారు. "AI టెక్నాలజీ చాలా ప్రమాదకరమైనది" అంటూ మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. "ఇవి నిజమైన ఫొటోలా లేక AI సృష్టించినవా?" అని చాలామంది కామెంట్ సెక్షన్లో ప్రశ్నిస్తున్నారు.

మహా కుంభమేళా జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మొత్తం 45 రోజుల పాటు జరగనుంది. ఇప్పటికే మొదటి 10 రోజుల్లోనే 10 కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. జనవరి 14న మకర సంక్రాంతి సందర్భంగా మొదటి పవిత్ర స్నానం (అమృత స్నానం) జరిగింది. ఇంకా ముఖ్యమైన స్నానాల తేదీలు జనవరి 29 (మౌని అమావాస్య), ఫిబ్రవరి 3 (వసంత పంచమి), ఫిబ్రవరి 12 (మాఘ పూర్ణిమ), ఫిబ్రవరి 26 (మహా శివరాత్రి) ఉన్నాయి. సంగమంలో ఒక్క మునక వేస్తే చాలు, జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని, ఆత్మ శుద్ధి అవుతుందని భక్తుల నమ్మకం.

ఏదేమైనా, క్రికెటర్ల సాధువుల గెటప్ ఫోటోలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. AI టెక్నాలజీతో క్రియేట్ చేసిన ఈ ఫొటోలు ఒకవైపు ఫ్యాన్స్‌ని అలరిస్తూనే, మరోవైపు AI మిస్‌యూస్ గురించి చర్చకు దారితీస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: