వెస్టిండీస్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. స్పిన్నర్ జొమెల్ వారిక్కన్ మాయాజాలంతో పాకిస్తాన్‌పై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఏకంగా 35 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌ గడ్డపై వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్ గెలవడం విశేషం. ముల్తాన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో వెస్టిండీస్ 120 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది వెస్టిండీస్. తొలి టెస్టులో పాకిస్థాన్ 127 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.

ఈ విజయంలో వెస్టిండీస్ స్పిన్నర్ జొమెల్ వారిక్కన్ హీరోగా నిలిచాడు. పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి పాక్ పతనాన్ని శాసించాడు. మ్యాచ్‌లో మొత్తం 9 వికెట్లు, సిరీస్‌లో 19 వికెట్లు తీసి వారిక్కన్ అదరగొట్టాడు. పాకిస్థాన్ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉండటంతో వారిక్కన్ తన స్పిన్ మాయాజాలాన్ని పూర్తిస్థాయిలో ప్రదర్శించాడు. పాక్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. నిజానికి వెస్టిండీస్ జట్టు 1990 నవంబర్ తర్వాత పాకిస్తాన్‌లో టెస్ట్ మ్యాచ్ గెలవడం ఇదే తొలిసారి. మధ్యలో 1997, 2006లో పర్యటించినా విజయమే లేదు.

254 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ మూడో రోజు ఆటను 76-4 స్కోర్‌తో ప్రారంభించింది. సౌద్ షకీల్‌పైనే పాక్ ఆశలన్నీ పెట్టుకుంది. కానీ కెవిన్ సిన్‌క్లైర్ అతడిని కేవలం 13 పరుగులకే అవుట్ చేయడంతో పాక్ కష్టాల్లో పడింది. ఆ తర్వాత నైట్‌వాచ్‌మన్ కాషిఫ్ అలీని వారిక్కన్ ఒక్క పరుగుకే పెవిలియన్ పంపడంతో పాక్ 76 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.

కెప్టెన్ బాబర్ ఆజమ్ (31), మహ్మద్ రిజ్వాన్ (25) కాసేపు ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. కానీ వారి పోరాటం ఎక్కువసేపు నిలవలేదు. రిజ్వాన్, సల్మాన్ అలీ అఘా కలిసి 39 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని వారిక్కన్ విడదీశాడు. సల్మాన్‌ను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసిన వారిక్కన్ ఆ వెంటనే రిజ్వాన్‌ను బౌల్డ్ చేశాడు.

గుడకేష్ మోతీ కూడా రెండు వికెట్లతో రాణించాడు. నోమన్ అలీని 6 పరుగులకే పెవిలియన్ పంపాడు. చివర్లో సజిద్ ఖాన్‌ను (7) బౌల్డ్ చేసి వారిక్కన్ వెస్టిండీస్‌కు విజయాన్ని అందించాడు. ఈ ఓటమితో పాకిస్థాన్ ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది. వెస్టిండీస్ మాత్రం ఎనిమిదో స్థానానికి ఎగబాకింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లు లార్డ్స్‌లో జూన్‌లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్‌లో తలపడనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: