టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ గురించి జనాలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కోహ్లీ అంటే యువతకు చెప్పలేని క్రేజ్ ఉంది. ఇక తాజాగా విరాట్ ఫిరోజ్ షా కోట్లా మైదానంలో రంజీ ట్రోఫీ కోసం ఢిల్లీ జట్టుతో కలిసి శిక్షణ పొందే సమయంలో ఒక ఆసక్తికరమైన అంశం చోటుచేసుకుంది. ఉదయం 9 గంటలకు, అతని జెట్ బ్లాక్ పోర్షే మైదానంలోకి వెళ్లి కోహ్లీ తన ఫస్ట్-క్లాస్ జట్టుతో కలిసి శిక్షణ తీసుకుంటున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఓ నాల్గవ తరగతి విద్యార్థి కబీర్ విరాట్ కోహ్లిని కలవడానికి వెళ్ళాడు. ఈ క్రమంలో వారిమధ్య చాలా ఆసక్తికరమైన సంభాషణ చోటుచేసుకుంది.

విషయం ఏమిటంటే, అతను తన చేతిలో విరాట్ స్కెచ్ ఒకటి తీసుకువచ్చి, “అంకుల్!, నేను మీలాగే భారత్ తరపున ఆడాలనుకుంటున్నాను. దానికి నేనేం చేయాలి?” అని అడిగాడు. దీనికి కోహ్లీ సమాధానం చెబుతూ... “దానికి మీరు ముందు బాగా కష్టపడి ప్రాక్టీస్ చేయాలి. దానికి మీ నాన్న మీకు ప్రాక్టీస్ చేయమని చెప్పకూడదు, మీరు ఆయన్ని అడగాలి, 'నాన్నా, నేను ప్రాక్టీస్‌కి వెళ్లాలి!' అని నువ్వే మీ నాన్నని అడగాలి!” అని చెప్పాడు. దాంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇకపోతే విరాట్ కోహ్లీ ఈ సందర్భంగా దాదాపు 35 నిమిషాల వార్మప్ తరువాత, నెట్ సెషన్ స్టార్ట్ చేసాడు. ఈ క్రమంలో స్పిన్నర్లు హర్ష్ త్యాగి, సుమిత్ మాథుర్‌లు వేసిన బంతులను ఎదుర్కొన్నాడు. అతని బ్యాటింగ్‌ను చూసి సహచర ఆటగాళ్లు అవాక్కయ్యారు. కాగా విరాట్ కోహ్లీ ఈ రంజీ ట్రోఫీని ‘పైలట్ ఎపిసోడ్’గా భావిస్తున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ముందు దేశవాళీ క్రికెట్ ద్వారా తన ఆటతీరు మెరుగుపర్చుకోవాలని మంచి కసిమీద ప్రాక్టీస్ చేస్తున్నాడు. కోహ్లీ రాకతో ఢిల్లీ జట్టులో ఉత్సాహం పెరిగింది. యువ ఆటగాళ్లు అతని నుంచి నేర్చుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు. ఢిల్లీ రంజీ జట్టుని ఒకసారి పరిశీలిస్తే... ఆయుష్ బడోని (సి), విరాట్ కోహ్లి, ప్రణవ్ రాజ్‌వంశీ (WK), అర్పిత్ రాణా, సనత్ సాంగ్వాన్, మయాంక్ గుసేన్, సుమిత్ మాథుర్, శివమ్ శర్మ, మనీ గ్రేవాల్, వంశ్ బేడి (WK), హర్ష్ త్యాగి, నవదీప్ సైనీ, సిద్ధాంత్ శర్మ, యష్ ధుల్, గగన్ వాట్స్, హిమ్మత్ సింగ్, జాంటీ సిద్ధూ, రాహుల్ గెహ్లాట్, వైభవ్ కంద్‌పాల్, జితేష్ సింగ్.

మరింత సమాచారం తెలుసుకోండి: