అవును, అభిషేక్ శర్మ అద్భుతం చేసాడు. ఇంగ్లండ్‌తో జ‌రిగిన 5 మ్యాచ్ ల సిరీస్‌లో భాగంగా టీమిండియా యువ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ జ‌ట్టు 4-1తో సిరీస్ గెల‌వ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ముంబ‌యిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన 5వ టీ20లో ఇంగ్లండ్ బౌల‌ర్ల‌కు నరకం అంటే ఏమిటో చూపించాడు. ఈ క్రమంలోనే మొత్తం 54 బంతుల్లోనే 135 ప‌రుగులు సాధించాడు. సదరు ఇన్నింగ్స్‌లో ఏకంగా 13 సిక్స‌ర్లు న‌మోదు కావ‌డం టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. దాంతో అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో ఏ భారతీయ బ్యాట‌ర్‌ సాధించని అత్యధిక సిక్సర్లు ఇవే కావడం విశేషం.

మొత్తంగా చూసుకుంటే, ఈ సిరీస్‌లో 5 మ్యాచ్ ల‌లో క‌లిపి అభిషేక్‌ 279 ర‌న్స్ పరుగెత్తించాడు. త‌ద్వారా టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. కట్ చేస్తే... భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య జరిగిన టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆట‌గాడిగా అభిషేక్ అవతరించాడు. 2021లో ఇంగ్లండ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల సిరీస్‌లో కోహ్లీ 231 పరుగులు చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఓవ‌రాల్‌గా తిలక్ వర్మ ఒక టీ20 సిరీస్ (ఏ జ‌ట్టుపైనైనా)లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో అగ్ర‌స్థానంలో ఉన్నాడు. గతేడాది దక్షిణాఫ్రికాపై కేవలం 4 ఇన్నింగ్స్‌ల్లోనే అతను 280 పరుగులు చేశాడు. ఇందులో వ‌రుస‌గా 2 సెంచ‌రీలు న‌మోదు కావ‌డం విశేషం.

ఇకపోతే టీమిండియా తరఫున ఒక టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయ‌ర్లు జాబితాను ఒకసారి పరిశీలిస్తే...
తిలక్ వర్మ : 280 - 4 ఇన్నింగ్స్ (వ‌ర్సెస్‌ దక్షిణాఫ్రికా, 2024)
అభిషేక్ శర్మ : 279 - 5 ఇన్నింగ్స్ (వ‌ర్సెస్‌ ఇంగ్లాండ్, 2025)
కోహ్లీ : 231 - 5 ఇన్నింగ్స్ (వ‌ర్సెస్‌ ఇంగ్లాండ్, 2021)
కెఎల్ రాహుల్ : 224 -  5 ఇన్నింగ్స్ (వ‌ర్సెస్‌ న్యూజిలాండ్, 2020)

మరింత సమాచారం తెలుసుకోండి: