సంగ్వాన్ తన వికెట్ గురించి మాట్లాడుతూ... ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టాడు. అతను మాట్లాడుతూ... "మ్యాచ్‌కు ముందు, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ ఢిల్లీ తరఫున ఆడతారని సమాచారం వచ్చింది. మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం అవుతుందని తెలియదు. మా రైల్వేస్ బౌలింగ్ జట్టు సభ్యులందరూ నాకు, ‘నీదే బాధ్యత! విరాట్ కోహ్లీని ఎలాగన్నా అవుట్ చేయాలి!’ అని అన్నారు. ఈ క్రమంలోనే సంగ్వాన్ బస్సు డ్రైవర్, కోహ్లీ వికెట్ ఎలా తీయాలో సూచన చేసాడని చెప్పుకు రావడం విశేషం. “మేము బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు, మా బస్సు డ్రైవర్ నాతో ఇలా అన్నాడు. ‘నీకు తెలుసా? విరాట్ కోహ్లీకి నాల్గవ లేదా ఐదవ స్టంప్ లైన్‌లో బంతి వేస్తే అతను ఔట్ అవుతాడు!’ అన్నాడు. నేను ఆ మాటలు విన్నాను, కానీ నేను నా బలాలపై మాత్రమే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాను. చివరికి, నా బలాలను ప్రదర్శిస్తూనే బస్ డ్రైవర్ ఇచ్చిన సలహాను కూడా పాటించాను... కోహ్లీ వికెట్ తీసుకున్నాను!" అని సంగ్వాన్ తెలిపాడు.
దాంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో బస్ డ్రైవర్ కూడా టాక్ అఫ్ ది టౌన్ అవుతున్నాడు. కాగా ఈ ఇన్నింగ్స్ లో కోహ్లీ కేవలం 15 బంతులు ఆడి ఒకే ఒక్క బౌండరీతో 6 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దాంతో ఆ వికెట్ సంగ్వాన్ కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ఈ వికెట్ వెనుక అతని కఠిన సాధన మాత్రమే కాకుండా, బస్సు డ్రైవర్ ఇచ్చిన చిన్న సలహా కూడా ఉండడం ఆసక్తికరంగా మారింది.