ISPL (ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్)లో ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ మరియు KVN బెంగళూరు స్ట్రైకర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఎంతో ఉత్కంఠ భరితమైన క్షణాల మధ్య కూడా ఓ ఫన్నీ దృశ్యం చోటుచేసుకోవడంతో క్రికెట్ అభిమానులు నవ్వకుండా ఉండలేకపోయారు. దాంతో ఆ దృశ్యం సోషల్ మీడియాలో కూడా నవ్వులు పూయిస్తోంది. విషయం ఏమిటంటే... ఫాల్కన్ రైజర్స్ బ్యాట్స్‌మన్ అయినటువంటి విశ్వజిత్ ఠాకూర్ మిడ్-వికెట్ వైపు చాలా వేగంగా షాట్ కొట్టాడు. దాంతో అది ఫోర్ బౌండరీ వైపు ఇసురుగా వెళ్ళింది. దాంతో బౌండరీ లైన్ వద్ద ఉన్న ఫీల్డర్ బంతిని ఆపడానికి ఓ లాంగ్ జంప్ వేసి 4 పరుగులు రాకుండా అయితే అడ్డుకున్నాడు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది.

ఆ ఫీల్డర్ బంతిని బౌలర్ వైపు విసిరి రనౌట్ చేయడానికి ప్రయత్నించగా, నాన్ - స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న ఫీల్డర్ రనౌట్ చేసే ప్రయత్నంలో స్టంప్‌లను తప్పించి బంతిని విసిరాడు పాపం. ఇంకేముంది కట్ చేస్తే... బంతి నేరుగా ఫోర్‌ బౌండరీ దాటేసింది. దాంతో ఈ ఊహించని మలుపు ఫలితంగా మొత్తం 7 పరుగులు ఇవ్వబడ్డాయి... బ్యాట్స్‌మెన్ అప్పటికే తీసుకున్న 3 పరుగులుతో కలిపి. కట్ చేస్తే... దాదోజీ కొండదేవ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ చివరికి 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ తొలుత ఇబ్బంది పడుతూ త్వరితగతిన వికెట్లు కోల్పోయి, నిర్ణీత ఓవర్లలో 84/9 మాత్రమే చేయగలిగింది. విశ్వజిత్ ఠాకూర్ 19 బంతుల్లో 26 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడగా, లిటన్ సర్కార్ 16 బంతుల్లో 15 పరుగులు చేశాడు. ఇక బెంగళూరు బౌలర్లు ఆరంభంలో ఇరగదీసారు. ఇర్ఫాన్ పటేల్ 4/14 మరియు సరోజ్ పరమాణిక్ 2/6తో చెలరేగిపోయారు. మొదటి 2 ఓవర్లలోనే హైదరాబాద్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది, బోర్డులో కేవలం 10 పరుగులు మాత్రమే ఉన్నాయి. అయితే, విశ్వజిత్ మరియు లిటన్ ఇన్నింగ్స్‌ను స్థిరీకరించారు. కీలకమైన 46 పరుగుల భాగస్వామ్యాన్ని ఏర్పరచారు. చివరి ఓవర్లో, హైదరాబాద్ ఆటగాడు ఇర్ఫాన్ ఉమైర్ తన ధైర్యాన్ని కూడగట్టుకొని, కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 10 పరుగులు డిఫెండ్ చేసి తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: