గ్రంధి కిరణ్ కుమార్ రంగంలోకి దిగి ఆటగాడి కొనుగోలుకు ఆసక్తి చూపితే ఎలా ఉంటుందో వ్యాపారులకు బాగా తెలుసు. వేలం విషయంలో కిరణ్ కుమార్ తనదైన చతురతకి చూపిస్తారు. వేలాన్ని కొంత దూరం వరకు లాక్కొచ్చి కిరణ్ తెలివిగా పోటీ నుంచి తప్పుకుంటారు. దీంతో ఒక రేటుకు అమ్ముడుపోవాల్సిన ఆటగాడు మరో భారీ ధరకు అమ్ముడు పోతాడు. ఇలా చేయడం వల్ల కిరణ్ కుమార్ అవతల ఫ్రాంఛైజీ పర్సు ఖాళీ అయిపోతుంది. ఐపీఎల్ 2025 ఆక్షన్ వేలం కూడా సరిగ్గా ఇదే జరిగింది. శ్రేయాస్ అయ్యర్ కోసం పంజాబ్ ఓనర్ ప్రీతి జింటాతో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున బిడ్డింగ్ వార్‌కు దిగగా పంజాబ్ పర్సును (రూ.26.7 కోట్లు) ఖాళీ చేయించి శ్రేయాస్ అయ్యర్ పై ఖర్చు చేయించారు కిరణ్.
గ్రంధి కిరణ్ కుమార్ విషయానికొస్తే ఆయన ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఛైర్మెన్‌గా, సహ యజమానిగా కొనసాగుతున్నారు. గ్రంధి మల్లికార్జున రావు చిన్న కుమారుడే గ్రంధి కిరణ్ అని చాలామందికి తెలియదు. ఆయన 1999 నుంచి జీఎంఆర్ గ్రూప్ బోర్డులో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్న జీఎంఆర్ గ్రూప్‌లో గ్రంధి కిరణ్ కుమార్ కీలక వ్యక్తి. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ & హైవేస్ మాజీ ఛైర్మెన్‌గా పని చేసిన గ్రంధి కిరణ్ కుమార్ 12000 కిలోమీటర్ల మేరా హైవేల నిర్మాణంలో కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత జీఎంఆర్ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు.అక్కడి నుంచి జీఎంఆర్ గ్రూప్ దృష్టిని క్రమంగా క్రీడా రంగం వైపు మరల్చారు.