క్వాలిఫయర్ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. నాలుగు ఓవర్లు వేసి కేవలం 34 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలకమైన వికెట్లు పడగొట్టాడు. దునిత్ వెల్లలాగే, దినేష్ కార్తీక్‌లను ఔట్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ రెండు వికెట్లతో రషీద్ ఖాన్ ఖాతాలో ఏకంగా 633 టీ20 వికెట్లు చేరాయి. కేవలం 461 మ్యాచ్‌లలోనే ఈ ఫీట్ సాధించి సగటున 18.07తో బౌలింగ్ చేయడం విశేషం. అంతేకాదు, తన కెరీర్‌లో అత్యుత్తమంగా 6/17 గణాంకాలు నమోదు చేయగా, నాలుగు సార్లు ఐదు వికెట్ల హాల్స్ సాధించాడు.
ఇంతకుముందు ఈ రికార్డును తన పేరిట చెక్కుచెదరకుండా 18 ఏళ్ల పాటు కాపాడుకున్న డ్వేన్ బ్రావో మొత్తం 631 వికెట్లు తీసి రెండో స్థానానికి పడిపోయాడు. బ్రావో తన టీ20 కెరీర్‌లో 24.40 సగటుతో బౌలింగ్ చేయగా, అత్యుత్తమంగా 5/23 నమోదు చేశాడు. అలాగే మూడు సార్లు ఐదు వికెట్ల హాల్స్ సాధించాడు. ఇక టాప్ వికెట్ టేకర్ల లిస్టులో వెస్టిండీస్ ఆటగాడు సునీల్ నరైన్ (574 వికెట్లు), సౌత్ ఆఫ్రికా వెటరన్ ఇమ్రాన్ తాహిర్ (531 వికెట్లు), బంగ్లాదేశ్ స్టార్ షకీబ్ అల్ హసన్ (492 వికెట్లు) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
మ్యాచ్ విషయానికొస్తే.. పార్ల్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఎంఐ కేప్ టౌన్ ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్ (44), రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (40) ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించి 9.2 ఓవర్లలోనే 87 పరుగులు జోడించారు. చివర్లో జార్జ్ లిండే (26), డెవాల్డ్ బ్రేవిస్ (44*), డెలానో పోట్‌గీటర్ (32*) మెరుపులు మెరిపించడంతో ఎంఐ కేప్ టౌన్ 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఛేదనలో పార్ల్ రాయల్స్ దూకుడుగా ఆరంభించినప్పటికీ.. ఓపెనర్ అవుటైన తర్వాత తడబడింది. కెప్టెన్ డేవిడ్ మిల్లర్ (45), దినేష్ కార్తీక్ (31) పోరాడినా ఫలితం లేకపోయింది. రషీద్ ఖాన్ వేసిన బంతికి దునిత్ వెల్లలాగే క్లీన్ బౌల్డ్ అవ్వడంతో రషీద్ చరిత్ర సృష్టించాడు. చివరికి ఎంఐ కేప్ టౌన్ ఘన విజయం సాధించింది.