అవును, మీరు విన్నది నిజమే. టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ వరల్డ్ రికార్డుపై కన్నేసినట్టు చాలా స్పష్టంగా గోచరిస్తోంది. ఫిబ్రవరి 6న ఇంగ్లండ్‌తో జరుగబోయే తొలి వన్డేలో ఈ అద్భుతం జరగబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. విషయం ఏమిటంటే? ఈ మ్యాచ్‌లో గనక షమీ 5 వికెట్లు తీస్తే.. వన్డేల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన బౌలర్‌గా వరల్డ్‌ రికార్డు లిఖించనున్నాడు. ప్రస్తుతం ఈ రికార్డు ఆసీస్‌ స్పీడ్‌స్టర్‌ మిచెల్‌ స్టార్క్‌ పేరిట ఉండగా ఇపుడు దానిని ఈయన అధిగమించనున్నాడు.

స్టార్క్‌ 102 మ్యాచ్‌ల్లో 200 వికెట్లు పడగొట్టి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇక షమీ విషయానికొస్తే, ప్రస్తుతం షమీ 100 ఇన్నింగ్స్‌ల్లో 195 వికెట్లు పడగొట్టాడు. 2023 వన్డే ప్రపంచ కప్‌ సందర్భంగా గాయపడిన షమీ.. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వడం ఆసక్తిగా మారింది. ఫిబ్రవరి 6 నుంచి స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగబోయే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌తో షమీ వన్డేల్లోకి కూడా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. షమీ చివరిగా ఆడిన వన్డే వరల్డ్‌కప్‌లో కేవలం 7 ఇన్నింగ్స్‌ల్లోనే 24 వికెట్లు పడగొట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో 3 ఐదు వికెట్ల ఘనతలు ఉండటం విశేషం.

34 ఏళ్ల షమీ రీఎంట్రీ ఇచ్చాక ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో వికెట్లేవీ పడలేదు. దాంతో అతన్ని నాలుగో టీ20లో పక్కన పెట్టడం జరిగింది. నాలుగో టీ20తో భారత్‌ సిరీస్‌ను కైవసం చేసుకోవడంతో షమీకి తిరిగి చివరి టీ20లో అవకాశం దక్కింది. ఈ సారి షమీ తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసేందుకు కసరత్తులు బాగానే చేసాడు. ఈ మ్యాచ్‌లో షమీ 3 వికెట్లు పడగొట్టి టీమిండియా విజయంలో కీలకప్రాత పోషించాడు. షమీ.. త్వరలో జరుగబోయే ఛాంపియన్స్‌ ట్రోఫీకి కూడా ఎంపికయ్యాడు. దాంతో ఈ టోర్నీలో షమీ పూర్వవైభవం సాధిస్తే ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత ప్రయాణం ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌తో అద్భుతం జరగనుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.

వన్డేల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన టాప్‌-5 బౌలర్లు:
1. మిచెల్‌ స్టార్క్‌ (102 మ్యాచ్‌లు)
2. సక్లయిన్‌ ముస్తాక్‌ (104 మ్యాచ్‌లు)
3. ట్రెంట్‌ బౌల్ట్‌ (107 మ్యాచ్‌లు)
4. బ్రెట్‌ లీ (112 మ్యాచ్‌లు)
5. అలన్‌ డొనాల్డ్‌ (117 మ్యాచ్‌లు)

మరింత సమాచారం తెలుసుకోండి: