ఇక విషయంలోకి వెళితే... రోహిత్ శర్మ గత కొంతకాలంగా టెస్టుల్లో విఫలమవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. మొదట స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్, తరువాత ఆస్ట్రేలియా గడ్డ మీద అతడు చాలా దారుణంగా పరాజయం పాలవ్వడంతో అతడిపై ఒకింత ట్రోలింగ్ మొదలయ్యింది. ప్రతిష్టాత్మక బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో అయితే 5 ఇన్నింగ్స్ ఆడి కేవలం 31 పరుగులే చేయడం వలన కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చవిచూడడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల ముంబై ఓపెనర్‌గా రంజీ ట్రోఫీ బరిలో దిగాడు రోహిత్ శర్మ. అయితే, అక్కడా ‘హిట్‌మ్యాన్’కు చేదు అనుభవమే మిగిలింది పాపం.
జమ్మూ కశ్మీర్‌తో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 3, రెండో ఇన్నింగ్స్‌లో 28 పరుగులకే పరిమితమయ్యాడు. ఈ సందర్భంలో ప్రస్తుతం రోహిత్ శర్మ ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు సిద్ధమయ్యాడు. ఇరుజట్ల మధ్య గురువారం నాగ్‌పూర్ వేదికగా తొలి వన్డే జరుగనుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మకు విచిత్రమైన ప్రశ్నలు ఎదురవడంతో తనదైన రీతిలో సమాధానం చెప్పాడు. తన పేలవ ఫామ్ గురించి ప్రశ్న ఎదురవ్వగా... దానికి బదులిస్తూ.. "అసలు ఎలాంటి ప్రశ్న అడుగుతున్నారు?.. ఆ ఫార్మాట్(టెస్టు) వేరు. దానికీ.. దీనికీ పోలిక ఎందుకు? నాలెడ్జ్ ఉండే అడుగుతున్నారా? క్రికెటర్లుగా మా కెరీర్‌లో ఎత్తుపళ్లాలు అనేవి సర్వసాధారణం. ఇదేమీ నాకు కొత్త కాదు. అలాగే ఆటగాడిగా నాకు ప్రతి సిరీస్ ఒక తాజా ఆరంభాన్ని ఇస్తుంది" అని రోహిత్ శర్మ మాట్లాడాడు. కాగా రోహిత్ చివరగా శ్రీలంకతో వన్డే సిరీస్ సందర్భంగా యాభై ఓవర్ల ఫార్మాట్ బరిలో దిగాడు. గతేడాది లంకతో మూడు వన్డే మ్యాచ్‌లు ఆడి వరుసగా 58, 64, 35 పరుగులు చేశాడు.