గడిచిన సంవత్సరం వెస్టిండీస్‌ వేదికపై జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో విజేతగా నిలిచిన టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం కురిపించిన సంగతి అందరికీ తెలిసిందే. ఏకంగా రూ. 125 కోట్ల నజరానా ప్రకటించి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఈ ప్రైజ్ మనీతో పాటు తాజాగా మరో విలువైన బహుమతిని కూడా అందించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. జట్టులోని ప్రతీ ఆటగాడికి అత్యంత విలువైన డైమండ్ రింగ్స్ ను ప్రదానం చేసినట్టు తెలుస్తోంది. అమెరికన్ స్పోర్ట్స్ లీగ్స్ అయిన ఎన్‌బీఏ, ఎన్ఎఫ్ఎల్ వంటి వాటి నుంచి స్ఫూర్తి పొంది బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు భోగట్టా.

ఇకపోతే, బీసీసీఐ తాజాగా నమాన్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఒకటి నిర్వహించింది. ఈ కార్యక్రమంలోనే ప్లేయర్స్ కు ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ వజ్రపు ఉంగరాలను ప్రదానం చేయడం విశేషం. తాజాగా ఈ ప్రదానోత్సవానికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ప్రత్యేకంగా విడుదల చేయగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా వారికి బహుకరించిన ఉంగరాలను వజ్రాలు, బంగారంతో రూపొందించారు. అలానే ఈ ఉంగరంపై భాగంలో టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్‌ ఇండియా అనే అక్షరాలను కూడా లిఖించడం గమనార్హం.

సదరు ఉంగరాలు మరిన్ని విశేషాలను కలిగి ఉన్నాయని చూసినవారు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అశోక చక్రం గుర్తు కూడా వాటిపై ఉందని, ఉంగరానికి రెండు వైపులా ఆటగాళ్ల పేర్లు, జెర్సీ నంబర్లతో పాటు భారత జట్టు ఎంత తేడాతో ఏ ప్రత్యర్థులపై విజయాలు సాధించిందో కూడా ముద్రించినట్టు కామెంట్స్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో రోహిత్ శర్మ, రిషభ్ పంత్, బుమ్రా, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య ఈ ఉంగరాలను స్వీకరించినట్లు చాలా స్పష్టంగా కనపడుతోంది. కాగా, టీ20 వరల్డ్ కప్‌ ఫైనల్లో సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో భారత జట్టు విజయం సాధించి టైటిల్ ను గెలుపొందిన సంగతి విదితమే. అమెరికన్ స్పోర్ట్స్ లీగ్స్ అయిన ఎన్‌బీఏ, ఎన్ఎఫ్ఎల్ వంటి వాటి నుంచి స్ఫూర్తి పొంది ఈ ఛాంపియన్స్ రింగ్ కల్చర్ ను బీసీసీఐ ప్రారంభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: