ఫిబ్రవరి 19 నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పాక్‌ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తన సెమీ-ఫైనల్ అంచనాలను వెల్లడించాడు. భారత్, పాక్‌, ఆఫ్ఘనిస్తాన్ టాప్-4లో ఉంటాయని అతడు జోస్యం చెప్పాడు. అయితే, నాల్గవ జట్టు ఎవరనేది మాత్రం ఇంకా చెప్పలేదు.

అక్తర్ అంచనాల్లో అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, ప్రస్తుత వన్డే ప్రపంచ కప్ ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియాకు అతడు చోటు ఇవ్వకపోవడమే. ఆస్ట్రేలియా బదులు, ఆఫ్ఘనిస్తాన్ బలమైన పోటీదారుగా నిలుస్తుందని అతడు నమ్ముతున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ పరిణితితో ఆడితే సెమీ-ఫైనల్స్‌కు చేరే సత్తా ఉందని అక్తర్ అభిప్రాయపడ్డాడు. "ఆఫ్ఘనిస్తాన్ మెచ్యూర్‌గా ఆడితే సెమీ-ఫైనల్స్‌కు వెళ్లగలదు" అని దుబాయ్‌లో జరిగిన మీడియా సమావేశంలో అక్తర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

ఆఫ్ఘనిస్తాన్ ఐసీసీ టోర్నమెంట్లలో "జైంట్ కిల్లర్"గా పేరు తెచ్చుకుంది. గతంలో బలమైన జట్లను ఓడించింది. 2023 వన్డే ప్రపంచ కప్‌లో ఆరో స్థానంలో నిలిచి అంతర్జాతీయ క్రికెట్‌లో తమ బలాన్ని నిరూపించుకుంది. టోర్నమెంట్‌లో అందరూ ఎదురుచూస్తున్న మ్యాచ్‌లలో ఒకటి ఫిబ్రవరి 23న జరగబోయే భారత్ vs పాక్‌ పోరు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలుస్తుందని అక్తర్ ధీమాగా ఉన్నాడు. అంతేకాదు, ఫైనల్‌లో కూడా ఈ రెండు జట్లే మళ్లీ తలపడాలని అతడు ఆశాభావం వ్యక్తం చేశాడు. "ఫిబ్రవరి 23న పాకిస్తాన్ ఇండియాను ఓడిస్తుందని నేను నమ్ముతున్నా. నిజానికి, రెండు జట్లు ఫైనల్‌లో మళ్లీ కలవాలని కోరుకుంటున్నాను" అని అతడు అన్నాడు.

కేవలం ఎనిమిది జట్లు, రెండు గ్రూపులుగా విడిపోయి పోటీ పడుతుండటంతో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 హోరాహోరీగా సాగుతుందని చెప్పొచ్చు. ప్రతీ మ్యాచ్ కీలకం కానుండటంతో ఈ టోర్నీ మరింత ఉత్కంఠభరితంగా ఉండనుంది. సరిగ్గా ఇంకా 10 రోజులు మాత్రమే ఈ మ్యాచ్లు స్టార్ట్ కావడానికి సమయం మిగిలి ఉంది. దాని తర్వాత క్రికెట్ ఫ్యాన్స్ కి చాలా ఎంటర్టైన్మెంట్ లభిస్తుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: