![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/sports/libra_libra/yuvac2663239-bb4d-42a5-8692-d073739e75b3-415x250.jpg)
కోహ్లీ కెప్టెన్ గా దిగిపోయాక.. ఫాఫ్ డుప్లెసిస్ అయినా ఆర్సీబీ తలరాత మారుస్తాడని భావించారు. కానీ అది జరగలేదు. దీంతో అతడిని పక్కకు పెట్టేసిన నేపథ్యంలో తాజా సీజన్ కు ఎవరు సారథ్యం వహిస్తారనే ప్రచారం గత కొద్ది రోజులుగా జరుగుతూనే ఉంది. కోహ్లీనే మళ్లీ సారథ్య బాధ్యతలు తీసుకుంటాడని అంతా అనుకున్నారు. కానీ గత కొంత కాలం నుండి ఓ కొత్త పేరు తెరపైకి వచ్చింది. విరాట్ కెప్టెన్సీ తీసుకోవడానికి ఆసక్తి చూపకపోవడంతో.. యువ ఆటగాడు రజత్ పాటిదార్ పేరు గట్టిగా వినిపిస్తోంది. జట్టు భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని.. రూ.11 కోట్లకు కొనుగోలు చేసిన అతడికే జట్టు పగ్గాలు అప్పజెప్పినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
పాటిదార్ ఇప్పటికే సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ కెప్టెన్ గా తన జట్టును ఫైనల్ కు తీసుకెళ్లడంలో కీలక పాత్రని పోషించిన సంగతి విదితమే. ఈ సీజన్లో 9 ఇన్నింగ్స్ లో 428 పరుగులతో సెకండ్ హైయెస్ట్ రన్నర్ గా నిలిచి అందరి దృష్టినీ ఆకర్శించాడు పాటిదార్. మరోవైపు ఐపీఎల్ లో కూడా రజత్ పాటిదార్ తనదైన బ్యాటింగ్ స్కిల్స్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. దాంతో అందరి దృష్టి అతగాడిపైన పడింది. పాటిదార్ మొత్తం 27 మ్యాచ్‌లు ఆడి, 799 పరుగులు చేయడం గమనార్హం. ఇందులో 7 అర్ధశతకాలు, ఒక శతకం ఉన్నాయి. ఐపీఎల్ లో అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 112. మరోవైపు కృనాల్ పాండ్యకు సారథ్య బాధ్యతలు అప్పగించొచ్చనే పుకార్లు షికారు చేసాయి. అయితే తాజా సమాచారంతో అది అబద్ధమని తేలింది.