క్రీడాభిమానులకు శుభవార్త! ఈ సంవత్సరం జరిగే IPL (ఇండియన్ ప్రీమియర్ లీగ్) కు సంబంధించి షెడ్యూల్ ను క్రిక్ బజ్ తాజాగా ప్రకటించింది. బిసిసిఐ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... తొలి మ్యాచ్ కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో జరగనున్నట్టు తెలుస్తోంది. మార్చి 22న శనివారం కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ మొదలవ్వనుంది. గత సీజన్లో రన్నర్ అప్ గా నిలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ మార్చి 23 ఆదివారం ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ తో పోటీపడనుండి. అదేవిధంగా మే 25న జరగనున్న ఫైనల్ మ్యాచ్, కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో నిర్వహించవచ్చని క్రిక్ బజ్ తన నివేదికలో పేర్కొంది.

ఇప్పటి వరకు ఐపీఎల్ 17 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుందనే విషయం తెలిసిందే. 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ పునాదులు పడ్డాయి. ఈ ఏడాది జరగబోయేది 18 వ సీజన్ కావడం గమనార్హం. ప్రస్తుత సీజన్లో నిర్వహించే ఫైనల్ మ్యాచ్ తో పాటు ప్లే ఆఫ్ -2 మ్యాచ్ కూడా కోల్ కతా వేదికగానే నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం... ప్రతి సంవత్సరం ప్రారంభ మ్యాచ్ డిపెండింగ్ ఛాంపియన్, మరొక జట్టు తలపడతాయి. ఈ ఏడాది తొలి మ్యాచ్ కోల్ కతా, బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. అంతేకాకుండా ప్రతి జట్టు సొంత మైదానంలో సగం మ్యాచ్ లలో తలపడాల్సి వస్తుంది. మిగతా మ్యాచ్ లు ప్రత్యర్థి మైదానాలలో ఆడాల్సి ఉంటుంది.

అయితే గతంలో దానికంటే, భిన్నంగా ఈసారి ఢిల్లీ, రాజస్థాన్ జట్లు తమ సొంత మైదానాలతో పాటు, ఇతర మైదానాలలో కూడా తలపడనున్నాయి. రాజస్థాన్ జట్టుకు సవాయి మాన్సింగ్ స్టేడియం సొంతమైదానం కాగా ఇది జైపూర్ నగరంలో ఉంది. ఈ నగరంలో 5 మ్యాచ్లను రాజస్థాన్ ఆడబోనుంది. ఆ తర్వాత అస్సాంలోని బర్సా పారా మైదానంలో మిగతా మ్యాచ్లు ఆడుతుంది. ఢిల్లీ జట్టుకు అరుణ్ జెట్లీ మైదానం సొంత గ్రౌండ్ కాగా ఇది ఢిల్లీ నగరంలో ఉందనే విషయం విదితమే. ఆ తర్వాత విశాఖపట్నంలోని క్రికెట్ మైదానంలో మిగతా మ్యాచులు ఆడుతుంది. ఐపీఎల్ పేరుకు తగ్గట్టుగానే ఈ సీజన్లో ఆటగాళ్లపై అన్ని జట్లు డబ్బుల వర్షం గుమ్మరించాయి. దాదాపు 182 మంది ఆటగాళ్ల కోసం 639.5 కోట్లను వెచ్చించడమంటే సాధారణమైన విషయం కాదు!

మరింత సమాచారం తెలుసుకోండి:

IPL