
అయితే అందరి కళ్లు మాత్రం ఫిబ్రవరి 23న జరిగే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ పైనే ఉన్నాయి. ఈ మ్యాచ్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రికెట్ ఫ్యాన్స్‌కి పూనకాలే. కానీ టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ మాత్రం ఈ మ్యాచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌కు అనవసరమైన హడావుడి చేస్తున్నారని తన యూట్యూబ్ ఛానెల్‌లో ఓ వీడియో ద్వారా చెప్పుకొచ్చాడు.
"టీమిండియా చాలా పటిష్టంగా ఉంది, కానీ పాకిస్థాన్ మాత్రం నిలకడలేని జట్టు" అని హర్భజన్ తేల్చి చెప్పాడు. అంతేకాదు, రెండు జట్ల ఆటగాళ్లను పోల్చి చూస్తూ పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్‌ను ఏకిపారేశాడు. భారత్‌పై బాబర్ ఆజమ్ బ్యాటింగ్ సగటు కేవలం 31 మాత్రమేనని, ఇది టాప్ బ్యాటర్‌గా చెప్పుకునే ఆటగాడికి చాలా తక్కువ అని హర్భజన్ విమర్శించాడు. "వరల్డ్ క్లాస్ బ్యాటర్ అంటే కనీసం 45 నుంచి 50 సగటు ఉండాలి" అని హర్భజన్ ఘాటుగా వ్యాఖ్యానించాడు.
ఇంకా పాక్ ఆటగాళ్ల రికార్డులను కూడా హర్భజన్ వెలికి తీశాడు. మహ్మద్ రిజ్వాన్‌కు భారత్‌పై 25 సగటు మాత్రమే ఉందని, గత ఫైనల్‌లో పాక్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఫఖర్ జమాన్ సగటు 46గా ఉందని చెప్పాడు. ఫఖర్‌ను మాత్రం హర్భజన్ మెచ్చుకున్నాడు. ఫఖర్ ఒక్కడే మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉన్న ఆటగాడని కొనియాడాడు.
ఇటీవలి ప్రదర్శనల గురించి మాట్లాడుతూ, ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లలో భారత్ ఆధిపత్యం చెలాయించిందని, పాకిస్థాన్ మాత్రం సొంతగడ్డపై న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాతో జరిగిన ట్రై-సిరీస్‌లో తేలిపోయిందని గుర్తు చేశాడు. పాకిస్థాన్ తమ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో ఓడిపోయే అవకాశం ఉందని, ఇదివరకే ఓడినట్టుగానే మళ్లీ ఓడిపోతుందని హర్భజన్ జోస్యం చెప్పాడు.
ఇక భారత్-పాకిస్థాన్ మ్యాచ్ విషయానికొస్తే, ఇది ఏకపక్షంగా సాగుతుందని హర్భజన్ అభిప్రాయపడ్డాడు. టిక్కెట్ల ధరలు కూడా మరీ ఎక్కువ ఉన్నాయని, అభిమానులకు ఈ మ్యాచ్ ఆశించినంత వినోదాన్ని ఇవ్వకపోవచ్చని హర్భజన్ తన యూట్యూబ్ వీడియోలో చెప్పుకొచ్చాడు.