క్రికెట్ ప్రపంచంలో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య పోరు అంటేనే ఒక ప్రత్యేకమైన ఆసక్తి. ముఖ్యంగా వన్డేలు, ఐసీసీ టోర్నీలలో ఈ రెండు జట్లు తలపడుతున్నాయంటే చాలు.. అభిమానులకు పూనకం వచ్చేస్తుంది. భారత్ జట్టు పేపర్ మీద బలంగా కనిపిస్తూ ఆధిపత్యం చెలాయించినా, బంగ్లాదేశ్ మాత్రం అప్పుడప్పుడు సంచలన విజయాలతో షాక్ ఇస్తూనే ఉంది. అందుకే ఈ రెండు జట్ల మ్యాచ్ అంటేనే క్రికెట్ ప్రేమికులకు కనులవిందు చేసేలా దుమ్ము రేపే పోరు ఖాయం.

భారత్ vs బంగ్లాదేశ్ - వన్డే రికార్డులు ఒకసారి చూస్తే..

ఇప్పటివరకు ఈ రెండు జట్లు వన్డే ఫార్మాట్‌లో 41 సార్లు ఢీకొన్నాయి. ఇందులో భారత్ జట్టు తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తూ ఏకంగా 32 మ్యాచ్‌లలో విజయం సాధించింది. బంగ్లాదేశ్ మాత్రం 8 మ్యాచ్‌లలో గెలిచి సంచలనం సృష్టించింది. ఒక మ్యాచ్ మాత్రం ఫలితం లేకుండా ముగిసింది.

ఇటీవలి ఫామ్ చూస్తే మాత్రం నిరాశే వ్యక్తమవుతోంది. చివరి ఐదు వన్డేల్లో బంగ్లాదేశ్ ఏకంగా మూడు మ్యాచ్‌లలో విజయం సాధించి భారత్‌కు చుక్కలు చూపించింది. గతంలో పూణేలో జరిగిన మ్యాచ్‌లో మాత్రం భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. కానీ అంతకుముందు జరిగిన ఆసియా కప్‌లో బంగ్లాదేశ్ 6 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి షాకిచ్చింది. 2022లో బంగ్లాదేశ్‌లో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను బంగ్లాదేశ్ కైవసం చేసుకుంది. తొలి రెండు మ్యాచ్‌లలో వరుసగా 1 వికెట్, 5 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాలు సాధించింది. ఇక చివరి మ్యాచ్‌లో మాత్రం భారత్ పుంజుకొని 227 పరుగుల భారీ తేడాతో గెలిచింది.

• ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్కటే మ్యాచ్.. కానీ అది సెమీఫైనల్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, బంగ్లాదేశ్ జట్లు ఇప్పటివరకు ఒక్కసారే తలపడ్డాయి. అది కూడా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్ కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో భారత్ బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించింది. బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ చేసి 264/7 పరుగులు చేసింది. వారి బ్యాటర్లలో తమీమ్ ఇక్బాల్ (70), ముష్ఫికర్ రహీమ్ (61) రాణించారు. కానీ భారత్ మాత్రం ఈ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. రోహిత్ శర్మ అజేయ సెంచరీ (123*)తో చెలరేగగా, విరాట్ కోహ్లీ (96*) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో భారత్ 9 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది.

ఇప్పుడు మళ్లీ ఈ రెండు జట్లు ఛాంపియన్స్ ట్రోఫీలో తలపడబోతున్నాయి. నేడు అంటే ఫిబ్రవరి 20న దుబాయ్‌లో జరగనున్న మ్యాచ్ కోసం ఇరు జట్ల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు గ్రూప్-Aలో ఉన్నాయి. దీంతో ఈ గ్రూప్ మరింత రసవత్తరంగా మారనుంది.

ఇక క్రికెట్ ప్రపంచ కప్‌లలో భారత్ 4 మ్యాచ్‌లలో గెలిస్తే, బంగ్లాదేశ్ ఒక్క మ్యాచ్‌లో (2007 ప్రపంచ కప్) విజయం సాధించింది. ఆ ఒక్క మ్యాచ్ మాత్రం భారత్‌కు పీడకలలా మిగిలిపోయింది. టీ20 ప్రపంచ కప్‌లలో భారత్ బంగ్లాదేశ్‌తో ఆడిన అన్ని 5 మ్యాచ్‌లలోనూ విజయం సాధించింది. టీ20 ఫార్మాట్‌లో భారత్ దే పైచేయి అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: