
ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ గురించి మాజీ క్రికెట్ క్రీడాకారుడు మహమ్మద్ కైఫ్ చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఎవరు ఏమనుకున్నా, అన్ని విమర్శలు చేసినప్పటికీ... ఒక వేళ ఈ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో భారత్ విఫలమైనా రోహిత్ శర్మ కెప్టెన్సీకి వచ్చిన నష్టమేమీ లేదంటూ.. ఓ యూట్యూబ్ చిట్ చాట్ లో చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఇంకా చాలా కాలం కొనసాగుతాడని ఈ సందర్భంగా జోష్యం చెప్పుకొచ్చాడు.
అంతే కాదండోయ్... ఇంకో ఆసక్తికరమైన విషయం కూడా ఈ మాజీ చెప్పుకు రావడం విశేషం. 2027 లో ఆడబోయే వరల్డ్ కప్ మ్యాచ్ కి కూడా అతనే కెప్టెన్ అని బల్లగుద్ది మరి చెప్పుకొచ్చాడు. ఎందుకంటే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్సీ లో టీమిండియా అదిరిపోయే ప్రదర్శనలు చేసిందని, భారత్ కు 72.5 శాతం విజయాలు లభించాయని.. అందుకే ఇంకా మరింత కాలం రోహిత్ టీమిండియా కెప్టెన్ గా కొనసాగుతాడని కైఫ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. సినిమా రంగంలోనైనా, క్రీడారంగంలో నైనా... విజయాలు సాధిస్తే పొగుడుతారని, పరాజయాలు పాలైతే విమర్శలు చేస్తారని... ఇవన్నీ సర్వసాధారణమని అన్నారు. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా రోహిత్ శర్మ ఓ ప్రతిభావంతుడైన ఆటగాడు మాత్రమే కాకుండా ఎంతో చతురతగలన నాయకుడు అంటూ ఆకాశానికి ఎత్తేసాడు కైఫ్. దాంతో ఈ వ్యాఖ్యలు విన్న రోహిత్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇకపోతే, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ విఫలం కావడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాతో పాటు సీనియర్ క్రికెటర్లు కూడా రోహిత్ శర్మ రిటైర్మెంట్ కు సమయం వచ్చిందని కామెంట్స్ చేయడం చాలా బాధాకరం. సునీల్ గవాస్కర్ లాంటి వాళ్లు కూడా రోహిత్ కు రిటైర్ అవాల్సిన సమయం వచ్చింది అనుకుంటా? అని కామెంట్లు చేయడంతో రోహిత్ శర్మ అభిమానులు కూడా నొచ్చుకొన్నారు. ఇటువంటి తరుణంలో మహమ్మద్ కైఫ్ చేసిన వ్యాఖ్యలు వారికి ఊరటనిచ్చాయి.