దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా అదిరిపోయే బోణీ కొట్టింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ విశ్వరూపం చూపించింది. బంగ్లాదేశ్ విసిరిన 229 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 3 వికెట్లు కోల్పోయి, 21 బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ మరోసారి తన బ్యాట్‌తో విజృంభించాడు. 2025లో అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ అజేయ సెంచరీతో కదం తొక్కాడు. ఈ విజయంతో భారత్ ఈ ఏడాది వరుసగా నాలుగో వన్డే విజయాన్ని ఖాతాలో వేసుకుంది. దీంతో మూడో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌పై కన్నేసిన భారత్‌కు ఇది మంచి బూస్ట్‌లాంటిదే.

అయితే ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ ఒక చరిత్ర సృష్టించాడు. ఈ విజయంతో రోహిత్ అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్‌గా తన 100వ విజయాన్ని నమోదు చేశాడు. మూడు ఫార్మాట్లలో కలిపి వంద విజయాలు సాధించిన అరుదైన కెప్టెన్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. అంతేకాదు, వన్డేల్లో కెప్టెన్‌గా 50 విజయాలు సాధించిన ఘనత కూడా రోహిత్ సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో 12, టీ20ల్లో 38 విజయాలు రోహిత్ సారథ్యంలో భారత్ సాధించింది.

ముఖ్యంగా రోహిత్ ఒక అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 30 ఏళ్లు దాటిన తర్వాత 100 ఇంటర్నేషనల్ విన్స్ సాధించిన ఏకైక కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు. 2017లో 30 ఏళ్ల వయసులో మొదటిసారి భారత జట్టుకు నాయకత్వం వహించిన రోహిత్, 2021-22లో పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. కెప్టెన్‌గా రోహిత్ సాధించిన వంద విజయాలు 30 ఏళ్లు దాటిన తర్వాతే రావడం విశేషం. అంతేకాదు, అత్యంత వేగంగా 100 విజయాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో రికీ పాంటింగ్‌తో రోహిత్ సమంగా నిలిచాడు. అయితే పాంటింగ్ 27 ఏళ్లకే కెప్టెన్ కాగా, రోహిత్ మాత్రం 30 ఏళ్ల తర్వాత కెప్టెన్సీ చేపట్టడం గమనార్హం. రోహిత్ విజయాల శాతం కూడా 70కి పైగా ఉండటం అతని నాయకత్వ పటిమకు నిదర్శనం.

బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ బ్యాట్‌తోనూ మెరుపులు మెరిపించాడు. కేవలం 41 పరుగులే చేసినా, అది జట్టు విజయానికి కీలకంగా నిలిచింది. ఈ క్రమంలోనే రోహిత్ వన్డేల్లో 11,000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన నాల్గవ భారత బ్యాటర్‌గా, ప్రపంచంలో పదవ ఆటగాడిగా రోహిత్ రికార్డుల్లోకి ఎక్కాడు. అంతేకాదు, 261 ఇన్నింగ్స్‌ల్లోనే 11 వేల పరుగుల మైలురాయిని చేరుకుని రెండో అత్యంత వేగవంతమైన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ (222 ఇన్నింగ్స్‌లు) మొదటి స్థానంలో ఉన్నాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనూ రోహిత్ 500 పరుగుల మార్క్‌ను దాటాడు. ఇప్పటివరకు 11 ఇన్నింగ్స్‌ల్లో 52.2 సగటుతో 522 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ అత్యధిక స్కోరు 123 నాటౌట్. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లలో రోహిత్ ఐదో స్థానంలో, ఓవరాల్‌గా 12వ స్థానంలో ఉన్నాడు. భారత్ తర్వాతి మ్యాచ్ ఫిబ్రవరి 23న పాకిస్థాన్‌తో జరగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: